calender_icon.png 18 October, 2024 | 3:29 AM

ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

18-10-2024 12:53:46 AM

  1. రేవంత్‌రెడ్డి సర్కార్ వేసిన కమిషన్ నమ్మశక్యం కాదు
  2. నవంబర్ 16 నుంచి దండోరా ధర్మయుద్ధ రథయాత్ర
  3. మీడియా సమావేశంలో మందకృష్ణ మాదిగ

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 17 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ అధిష్టానానికి, రేవంత్‌రెడ్డి సర్కార్‌కు చిత్తశుద్ధి లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు.

నవంబర్ 16 నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు దండోరా ధర్మయుద్ధ రథయాత్ర చేపట్టబోతున్నట్లు తెలిపారు. డిసెంబర్ 21న మాదిగల ధర్మయుద్ధ మహా ప్రదర్శన చేయబోతున్నట్లు చెప్పారు. మాదిగల బల ప్రదర్శన ఏ రూపం తీసుకుం టుందో దానికి రేవంత్‌రెడ్డి సర్కారే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ప్రభుత్వం వేసిన కమిషన్ నమ్మశక్యం కాదని మాదిగలు బలంగా నమ్ముతున్నారని చెప్పారు.

గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కమిషన్లు వేశాయి కానీ వాటి సిఫార్సులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు కొంత మంది తమ అధికారాన్ని ఉపయోగించి వర్గీకరణ జరిగితే తమ ఉనికిని కోల్పోతామన్న భయంతో వర్గీకరణను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు పోరాడాలి, మాలలు అడ్డుకోవాలనే కుట్ర కోణం రేవంత్‌రెడ్డిలో దాగి ఉందన్నారు. హామీలు ఇవ్వడంలో, వాటిని అమలు చేయకుండా మోసగించడంలో రేవంత్‌రెడ్డి దిట్ట అని మండిపడ్డారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్ మాదిగ, హైదరాబాద్ అధ్యక్షుడు టీవీ నర్సింహ మాదిగ, జాతీయ ప్రధాన కార్యదర్శి కోళ్ల శివమాదిగ, ఎంఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు సోమశేఖర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.