స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జనగామ, నవంబర్ 26 (విజయక్రాంతి): తెలంగాణలో విద్యాభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ పెద్దపీట వేస్తోందని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం జనగామ కలెక్టరేట్‌లో నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో సరైన కేటాయింపులు చేయలేదన్నారు.
విద్య కోసం బడ్జెట్ కేటాయింపుల్లో సరైన న్యాయం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. రేవంత్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యనందించేందుకు కంకణం కట్టుకుందని చెప్పారు. అందులో భాగంగానే రాష్ట్రంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి పూనుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో 50 వేల ఉద్యోగాలు ఇచ్చిందన్నారు.
8 లక్షల కోట్ల అప్పుతో అధికారం స్వీకరించిన కాంగ్రెస్.. ఎన్నో అవరోధాలను అధిగమించి 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు.