28-03-2025 12:12:00 AM
సీఎం వద్ద విద్యాశాఖ ఉంచుకుని సమీక్ష లేకుండా పరీక్షలు
బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్
ఎస్‌ఎస్‌సీ బోర్డు కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్‌వీ ధర్నా
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 27(విజయక్రాంతి) : సీమాంధ్ర కార్పొరేట్ విద్యాసంస్థలతో కుమ్మక్కైన సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పదోతరగతి ప్రశ్నాపత్రాలను అమ్ముకుందని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు విమర్శించారు. గురువారం నాంపల్లిలోని ఎస్‌ఎస్‌సీ బోర్డు కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌వీ గెల్లు శ్రీనివాస్, తుంగబాలు మాట్లాడుతూ విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్‌రెడ్డి పరీక్షలకు ముందు ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని విమర్శించారు. అందువల్లే నకిరేకల్, మంచిర్యాల, వికారాబాద్, జుక్కల్‌లో పేపర్ లీక్ జరిగిందని ఆరోపించారు.
పేపర్ లీక్‌కు బాధ్యత వహించి సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు నాలుగు పరీక్షలు నిర్వహిస్తే 4ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడం చూస్తే విద్యాశాఖ ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతోందన్నారు. కార్పొరేట్ పాఠశాలలతో కుమ్మక్కై కాంగ్రెస్ ఎమ్మెల్యేలే లీకులకు పాల్పడ్డారని ఆరోపించారు. పరీక్షలు సరిగా నిర్వహించమని కోరితే సీఎం ఆదేశాల మేరకు కేటీఆర్‌పై నకిరేకల్‌లో అక్రమ కేసులు పెట్టడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. ప్రశ్నాపత్రం లీక్‌కు కారకులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ ఉపాధ్యక్షుడు కడారి స్వామి, నాయకులు చటారి దశరథ్, కాటం శివ, నర్సింగ్, శ్రీను నాయక్, మిద్దె సురేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.