నారాయణపేట,(విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం నర్వ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఆస్పత్రి ఉద్యోగుల హాజరు రిజిస్టర్ పరిశీలించి ఉద్యోగుల వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం మందుల స్టాక్ పరిశీలించి రోగులకు సరిపడా మందులు వస్తున్నాయా, లేదా? అడిగి తెలుసుకున్నారు. ఈ నెలలో ఎన్ని ప్రసవాలు ఆసుపత్రిలో జరిగాయని అడిగారు. ఫీవర్, డెంగ్యూ లాంటి కేసులు వచ్చాయా అనే అడిగారు. అలాగే ఆసుపత్రిలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం జిల్లా కలెక్టర్ కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేశారు.
పాఠశాల ఆవరణ, వంటగది, బాత్రూం తదితర వాటిని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాలలో సిబ్బంది రిజిస్టర్, స్టాక్ రూమ్ పరిశీలించారు. అలాగే మధ్యాహ్న భోజనానికి తయారు చేసిన వంటను జిల్లా కలెక్టర్ పరిశీలించి వంట గది పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని నాణ్యవంతంగా వంట చేయాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడే విద్యాబోధన గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతిలో 100% ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థినీలకు సూచించారు.