calender_icon.png 25 October, 2024 | 4:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

25-10-2024 02:52:59 PM

కూకట్‌పల్లి : ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కెపిహెచ్బి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. గత ప్రభుత్వ హాయంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ లు హైదరాబాద్ మహానగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలు మర్చిపోలేని విధంగా నగరాన్ని ప్రపంచ స్థాయి నగరాలలో ఒకటిగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు.

గడిచిన 10 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడి సమస్యలు ఆక్కడే నిలిచిపోయి అభివృద్ధి కుంటపడిందన్నారు. అభివృద్ధి పనుల కోసం నియోజకవర్గాలలో ఒక్క రూపాయి కూడా వెచ్చించలేని స్థితికి జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్ విభాగాలు వచ్చాయంటే ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకు వెళ్తూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు రావాలని సూచించారు. రానున్న ఏ ఎన్నికల్లోనైనా తిరిగి బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయమన్నారు. అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజా పాలన పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ మందాడి శ్రీనివాసరావు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు రాజేష్, సాయిబాబు మహిళా నాయకులు తదితరులు ఉన్నారు.