11-02-2025 12:32:14 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): కేబీఆర్ పార్క్(Kasu Brahmanandha Reddy National Park) చుట్టూ ఆరు జంక్షన్ల అభివృద్ధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(Greater Hyderabad Municipal Corporation) మరో ముందడుగు వేసింది. పార్క్ చుట్టూ భూసేకరణలో బల్దియా వేగం పెంచినట్లు అధికారులు పేర్కొన్నారు. 400 ప్రైవేటు ఆస్తులను గుర్తించిన జీహెచ్ఎంసీ భూసేకరణకు రూ.460 కోట్లు కేటాయించింది. రూ.1200 కోట్లతో కేబీఆర్ పార్క్ చుట్టూ ఆరు జంక్షన్ల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. కేబీఆర్ పార్క్ చుట్టూ 6 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాసుల నిర్మాణ అభివృద్ధికి జీహెచ్ఎంసీ రోడ్ నెం.45 కూడలిలో 40, అగ్రసేన్ కూడలిలో 45, ఫిల్మ్ నగర్ కూడలిలో 43 ఆస్తులు సేకరణకు మార్కింగ్ చేస్తుంది.
జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద 47, ముగ్ధా చౌరస్తాలో 40, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద 18 ఆస్తులు బల్దియా సేకరించనుంది. ఆస్తుల సేకరణపై పలువురు ప్రముఖులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అలైన్ మెంట్ మార్చాలంటూ జీహెచ్ఎంసీకి వినతులు పంపించారు. కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి బల్దియాకు ఫిర్యాదు చేశారు. జంక్షన్ల అభివృద్ధి పనులకు ఈ నెలఖారులోగా టెండర్లు పిలిచేందుకు సన్నాహాలు చేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు కేబీఆర్ పార్క్ స్థలాన్ని ముట్టుకోకుండా జంక్షన్లు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు.