calender_icon.png 19 April, 2025 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేతన్నలు, రైతన్నల సంక్షేమం ప్రాధాన్యతగా ప్రభుత్వ పాలన

12-04-2025 01:15:12 AM

అపెరల్ పార్క్‌లో మరో పరిశ్రమ యూనిట్ ను ప్రారంభించిన మంత్రులు

సిరిసిల్ల, ఏప్రిల్ 11(విజయక్రాంతి): నేతన్నలు, రైతన్నల సంక్షేమం ప్రాధాన్యతగా రాష్ట్ర ప్రభుత్వం  పాలన సాగిస్తుందని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్క్ లో  7.6 ఎకరాల విస్తీర్ణంలో 62 కోట్లతో లక్షా 73 వేల చదరపు అడుగుల పంక్చుయేట్ వరల్ ప్రైవేట్ లిమిటెడ్( టెక్స్ పోర్ట్)యూనిట్ ను  శుక్రవారం చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు,  బిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ లతో కలిసి  ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిశ్రమ శిలా ఫలకాన్నీ ఆవిష్కరించారు. యూనిట్ లోని ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు.

అనంతరం యూనిట్‌లోని ఉద్యోగులతో ముచ్చటించారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. నేతన్నల జీవనోపాధి కల్పించే విధంగా సిరిసిల్ల గడ్డ మీద వర్కర్ టూ ఓనర్, అపెరల్ పార్క్ ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు.  20 వేల 600 కోట్ల రూపాయల రైతులకు ఏక కాలంలో రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం  తెలంగాణ ప్రభుత్వం అని, నేతన్న లకు కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా 34 కోట్ల రూపాయలతో లక్ష రూపాయల రుణమాఫీ పూర్తి చేశామని మంత్రి తెలిపారు. నేతన్న లకు పెండింగ్ లో ఉన్న 914 కోట్ల బకాయిలు విడుదల చేయడం జరిగిందని అన్నారు.  రాష్ట్రంలో అన్ని శాఖలలో అవసరమైన వస్త్రాలను చేనేత కార్మికుల ద్వారానే కొనుగోలు చేస్తున్నామని, ఇప్పటికే కార్మికులకు 900 కోట్ల రూపాయల ఆర్డర్స్ ప్రభుత్వం అందించిందని అన్నారు. ముఖ్యమంత్రితో చర్చించి త్వరలోనే వర్కర్ టు ఓనర్ కార్యక్రమం పునరుద్ధరిస్తామని అన్నారు.

దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందేలా కృషి : పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ 

గత కాంగ్రెస్ హయాంలో నేతన్నలు కాపాడేందుకు వీలుగా అన్ని చర్యలు తీసుకున్నామని ఐ టి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌అన్నారు.  నేతన్న లకు అంత్యోదయ కార్డులను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు.  టెక్స్ పోర్ట్ సంస్థ ప్రతినిధులతో చర్చించి వారికి ఉన్న సమస్యలను పరిష్కరించి నేడు ఈ పరిశ్రమను ప్రారంభించామని అన్నారు. సిరిసిల్ల నేతన్న లకు దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. వేములవాడ దేవాలయ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించామని అన్నారు.

శాతవాహన విశ్వ విద్యాలయాన్ని తమ ప్రభుత్వం స్థాపించిందని, దీనికి సంబంధించి ఇంజనీరింగ్ కళాశాల, లా కళాశాలలను మళ్లీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో నీటి పారుదల సౌకర్యం, రహదారుల సౌకర్యం, విద్యా, వైద్య సౌకర్యాలు కల్పనకు కృషి చేస్తున్నామని, అన్ని రంగాలలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచుతామని అన్నారు.  స్థానికులకు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించే ఇటువంటి పరిశ్రమకు భవిష్యత్తులో ఎటువంటి అవసరమున్న ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని అన్నారు.

కార్యక్రమంలో బీసి సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, కంపెనీ సీఈఓ చంద్రశేఖర్  ఎస్పీ మహేష్ బీ గీతే, సెస్ ఛైర్మెన్ చిక్కాల రామారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, సిరిసిల్ల ఆర్డీవో రాధా బాయ్, వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఏడీ రాఘవేందర్, ప్రజా ప్రతినిధులు ప్రజలు కంపెనీ సిబ్బంది  పాల్గొన్నారు.