08-03-2025 12:23:09 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 7 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జీహెచ్‌ఎంసీలో పేరుకుపోయిన బకాయిలను వసూలు చేసేందుకు వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) స్కీంను తీసుకొచ్చింది.
జీహెచ్‌ఎంసీ అధికారుల ప్రతిపాదనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీవాసులకు 2024 ఆర్థిక సంవత్సరానికి 90 శాతం వడ్డీ మాఫీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పేరుకుపోయిన బకాయిలపై కేవలం 10 శాతం వడ్డీతో కలిపి ‘వన్ టైమ్ స్కీమ్‌ను సద్వినియోగం చేసుకోవాలని నగర వాసులకు సూచించారు.
రూ.2 వేల కోట్ల వసూలు లక్ష్యం
ప్రస్తుతం అమలులోకి వచ్చిన ఓటీఎస్ ద్వారా దాదాపు రూ.2 వేల కోట్లు వసూలు చేయడమే జీహెచ్‌ఎంసీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది అమలు చేసిన ఓటీఎస్‌ను లక్షమంది వినియోగదారులు సద్వినియోగం చేసుకున్నారు. ఈసారి కూడా ప్రభుత్వం ఓటీఎస్‌కు అనుమతి ఇవ్వడంతో వినియోగదారుల నుంచి పన్ను బకాయిలు భారీగా వసూలు అవుతాయని అధికారులు యోచిస్తున్నారు.
గ్రేటర్ పరిధిలో వినియోగదారుల నుంచి భారీగా బకాయిలు పేరుకుపోయాయి. దీంతో జీహెచ్‌ఎంసీ నిర్వహణ ఇబ్బందిగా ఉందని పలువురు అధికారులు చర్చించుకుంటున్నారు. నగరంలో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఆధార పడాల్సిన పరిస్థితిలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. కాగా ఈ ఓటీఎస్ జీహెచ్‌ఎంసీకి, వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు విశ్వాసంతో ఉన్నారు.