సుల్తానాబాద్ లో సీఎం కప్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే విజయ రమణారావు...
పెద్దపల్లి (విజయక్రాంతి): క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. బుధవారం సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో మండలస్థాయి సీఎం కప్ టోర్నమెంట్స్ ను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుండి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సీఎం కప్ టోర్నమెంట్స్ ను నిర్వహిస్తుందన్నారు. స్వయంగా ఫుట్ బాల్ క్రీడాకారుడు అయిన సీఎం రేవంత్ రెడ్డి క్రీడల ప్రోత్సహించేందుకు ప్రత్యేకించి ఒక యూనివర్సిటీని నెలకొల్పనున్నారని తెలిపారు.
గత ప్రభుత్వం క్రీడలను పూర్తిగా విస్మరించిందని చెప్పారు. క్రీడలకు పుట్టినిల్లు అయిన సుల్తానాబాద్ లో ఎందరో క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఈ ప్రాంతానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారని చెప్పారు. ఇదే పరంపరను కొనసాగించాలని ఆయన స్థానిక సీనియర్ క్రీడాకారులను కోరారు. ఇందులో భాగంగా జూనియర్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బిరుదు రాజమల్లు స్మారకార్థం తెలంగాణ స్థాయి టోర్నమెంట్స్ ను నిర్వహించనున్నట్టు ఆయన క్రీడాకారుల హర్షద్వానాల మధ్య ప్రకటించారు. తాను స్వయంగా బాధ్యతతో ఈ టోర్నమెంట్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, ఏఎంసి చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, డివైస్ఓ సురేష్, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ఎం రవీందర్, ఎంపీడీవో, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.