calender_icon.png 8 October, 2024 | 3:59 AM

వరదల నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం

04-09-2024 02:22:31 AM

  1. ప్రజల్ని ముందే హెచ్చరిస్తే ఇంత ఘోరం జరుగకపోయేది 
  2. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి 
  3. మాజీ మంత్రి హరీశ్‌రావు 

ఖమ్మం, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఎన్నడూ లేని రీతిలో ఖమ్మం నగరాన్ని వరదలు ముంచెత్తాయని, భారీ ఎత్తున ఆస్తి నష్టంతోపాటు ప్రాణ నష్టం సంభవించిందని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. హరీశ్‌రావు నేతృత్వంలో బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం మంగళవారం ఖమ్మంలోని వరద ప్రాంతాల్లో పర్యటించి, బాధితులను నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. ముందస్తుగా ప్రజల్ని హెచ్చరించినట్టయితే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదన్నారు.

ఐఎండీ హెచ్చరించినా ప్రభుత్వం మొద్దు నిద్రపోయిందని, ఫలితంగా ప్రజలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ప్రజలు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం పర్యటనకు వచ్చి, బాధితులను కలిసి మాట్లాడకుండా హాయ్ చెప్పి వెళ్ళిపోవడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. సీఎం ప్రకటించిన రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు. వరదల్లో 9 మంది చిక్కుకుంటే కనీసం వారిని కాపాడలేకపోయిందని, చివరికి గ్రామస్తులే ధైర్యం చేసి, కాపాడడం ప్రభుత్వానికి సిగ్గుచేటని హరీశ్‌రావు మండిపడ్డారు. 

ప్రతి కుటుంబానికి రూ.2 లక్షలు ఇవ్వాలి

జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండీ ఏం చేస్తున్నారని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఒక్కో ఇంటికి రూ.4 లక్షల నష్టం జరిగిందన్నారు. ఒక్కో కుటుంబానికి తక్షణ సాయంగా రూ.2 లక్షలు అందజేయాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున అందజేయాలని కోరారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఇసుకమేటేసిన పొలాల రైతులకు ఎకరాకు రూ.50 వేలు చెల్లించాలని కోరారు.  రాష్ట్రంలో జరిగిన విపత్తు గురించి, వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలని హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని డిమాండ్  చేశారు. అందరం కలిసి, మోదీని కలిసి న్యాయం చేయమని కోరదామని చెప్పారు. 

వరద బాధితులకు బీఆర్‌ఎస్ భరోసా

వరద బాధితులకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా నిలిచి, ఆదుకుంటుందని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, సబితా ఇంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు వరద బాధితులను స్వయంగా కలిసి, వారి గోడు విని, భరోసా కల్పించారు. తమ పార్టీ నుంచి ఆదుకుంటామని పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చి, కన్నీళ్లు తుడిచారు. బాధితులకు  నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు తదితరులు పాల్గొన్నారు. 

పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 50 వేలు ఇవ్వాలి

సూర్యాపేట: వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే ఎకరాకు రూ.50 వేల పరిహారాన్ని అందించాలని మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలోని కాగిత రామచంద్రాపురం వద్ద తెగిన సాగర్ ప్రధాన ఎడమ కాల్వ కట్టను వారు పరిశీలించారు. రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులు తక్షణమే ఆదుకోవాలని కోరు.

బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందంపై రాళ్ల దాడి

ఖమ్మంలో వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న హరీశ్‌రావు బృందంపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు. పట్టణంలోని బొక్కలగడ్డ ప్రాంతంలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన క్రమ ంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. గొడవ రాళ్ల దాడికి దారితీయగా, అక్కడే ఉన్న హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ కార్లకు రాళ్లు వచ్చి, తగిలాయి. దీంతో నాలుగు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడిలో బీఆర్‌ఎస్ నాయకులు సంతోష్‌రెడ్డికి తీవ్ర గాయలయ్యాయి. స్థానికంగా మరో వ్యక్తి కూడా గాయపడ్డారు. సంతోష్‌రెడ్డిని ఖమ్మంలోని మమత ఆస్పత్రికి తరలించి, చికిత్స చేస్తున్నారు.

బాధిత ప్రజలు బీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఉంటున్నారనే అక్కసుతోనే కాంగ్రె స్ పార్టీ నాయకులు రౌడీలను ఉసికొల్పి తమపై హత్యాయ త్నం చేయించారని హరీశ్‌రావు ఆరోపిం చారు. ఈ దాడిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖండించారు. వరదల సమయంలో రాజకీయ లబ్ధికోసం ప్రయత్నించడాన్ని వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. హరీశ్‌రావు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు తుమ్మల.  దాడి చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్,  మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, బానోత్ మదన్‌లాల్, మాజీ జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్‌రాజు ఖమ్మం సీపీ సునీల్‌దత్‌కు ఫిర్యాదు చేశారు.