calender_icon.png 25 February, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా సప్లులో సర్కార్ విఫలం

25-02-2025 02:07:52 AM

  1. రైతుల ఎరువుల కష్టాలు తీర్చండి
  2. మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): రైతుల అవసరాలకు తగినంత యూరియా సప్లు చేయడంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సోమవారం ‘ఎక్స్’లో మండిపడ్డారు. యూరియా కోసం రైతులు మండుటెండల్లో తంటాలు పడుతున్నారని పేర్కొన్నారు.

మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీకి పోలీసులు టోకెన్లు జారీ చేశారని, ఇదెక్కడి చోద్యమని ప్రశ్నించారు. తాజాగా జగిత్యాలలో రైతులు పాస్ బుక్కులు, ఆధార్ కార్డులు క్యూలో పెట్టాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇలాగే రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, సీఎం రేవంత్‌రెడ్డి మళ్లీ ఆ రోజులు తీసుకువస్తున్నారని ధ్వజమెత్తారు.

బీఆర్‌ఎస్ పాలనలో రైతు రారాజుగా ఉండేవాడని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతును నట్టేట ముంచుతున్నదన్నారు. రైతు డిక్లరేషన్, రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్ పేరిట సర్కార్ రైతులను మోసం చేసిందన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న కంట నీరు పెట్టించడం మంచిది కాదని హితవు పలికారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతాంగానికి అవసరమైన యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.