calender_icon.png 27 December, 2024 | 8:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం సేకరణలో సర్కార్ విఫలం

25-12-2024 02:23:33 AM

* ఉత్పత్తున వడ్లలో  సగమైనా కొనలేదు..

* వంకలతో సన్నాల బోనస్‌కు ఎగనామం

* బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): ధాన్యం సేకరణలో సర్కార్ విఫలమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, ప్రభుత్వం కేవలం 46 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించిందని ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ‘కొన్నది కాకరకాయ.. కొసిరింది గుమ్మడికాయ’ అన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.

రైతుభరోసా కింద ఎకరాకు ఏడాదికి రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తానని హామీ ఇచ్చిందని, ఆ హామీ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సన్నాలకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ అని రైతుల్లో ఆశలు రేపారని, తీరా కేంద్రాలకు తీసుకొస్తే వడ్లకు వంకలు చెప్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో రైతుకు భరోసానే లేదని, ఇక కౌలు రైతులు, కూలీల సంగతి ఎందుకు ప్రభుత్వానికి పడుతుందని విస్మయం వ్యక్తం చేశారు.