మునుగోడు/మర్రిగుడ,(విజయక్రాంతి): ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ధాన్యం దళారుల పాలై వరి ధాన్యం పత్తి కొనుగోలు పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చిరుమర్తి లింగయ్య పాల్వాయి స్రవంతి తో కలిసి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు.గత సంవత్సరం నల్గొండ జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగితే ఈ సంవత్సరం కృష్ణా నదిలో పుష్కలంగా నీళ్లు రావడం వల్ల ఐదున్నర లక్షల ఎకరాల్లో వరి సాగు పెరిగింది. ఏడున్నర మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మూడు లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేసే పరిస్థితి నల్గొండ జిల్లాలో లేదని అన్నారు.
ఇప్పటివరకు నల్గొండ జిల్లాలో కూడా ఒక కిలో సన్న వడ్లను కొనలేదు.వడ్లకు మద్దతుధర వస్తలేదని రైతులు మిర్యాలగూడలో రాస్తారోకో చేసిన పరిస్థితి.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 15000 రైతుబంధు, రెండు లక్షల రుణమాఫీ రైతులకు ఇవ్వాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.నల్గొండ జిల్లాలో 9,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే, 200 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంటే అందులో 50 కోట్లు మాత్రమే చెల్లించారు. రైతులకు సకాలంలో డబ్బులు అందించే పరిస్థితిలో ప్రభుత్వం లేదని, ఉన్న వడ్లకు కూడా విపరీతంగా తరుగు పెట్టి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు.