23-02-2025 10:22:11 PM
మాలమహానాడు డిమాండ్...
ముషీరాబాద్ (విజయక్రాంతి): ఎస్సీ జాబితాలోని 58 కులాకు అన్యాయం చేసి, మాదిగలకు ప్రయోజనం చేకూర్చే విధంగా వర్గీకరణ బిల్లును రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి నెలలో ప్రవేశపెట్టడానికి చేస్తున్న ప్రయత్నం తక్షణమే ప్రభుత్వం మానుకోవాలని మాలమహానాడు జాతీయ కమిటీ అధ్యక్షులు డా.వి.ఎల్. రాజు, గౌరవ అధ్యక్షులు, సుప్రీం కోర్ట్ న్యాయవాది, వడ్లమూరి కృష్ణ స్వరూప్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, జె ఎన్ రావు డిమాండ్ చేసారు.
ఈ మేరకు ఆదివారం మాలమహానాడు కేంద్రం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ... రాష్ట్రంలో రాజ్యాంగం నిభంధనలను దిక్కరించి వర్గీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఓటు బ్యాంకు వర్గీకరణ రాజకీయాలను అడ్డుకోవాలని, జాతీయ ఎస్సి కమిషన్ చైర్మన్ కిషోర్ మాక్వాన కు విజ్ఞప్తి చేశారు. ఆయనకు వినతిపత్రాన్ని పంపినట్టు, రిజనల్ డైరెక్టర్ సైతం పంపినట్టు వారు వెల్లడించారు.
338 ఆర్టికల్, క్లాజ్ 9 దిక్కరించి వర్గీకరణ చేపడుతున్న కాంగ్రెస్ పై చర్యలు తీసుకోవాలని భారత రాష్ట్రపతికి సిపార్సు చేయాలనీ, ఎస్సి కమిషన్ ను కోరినట్లు వారు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న వర్గీకరణ చర్యలపై స్టే ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హై కోర్ట్ లో రిట్ పిటిషన్ వేయడం జరిగిందన్నారు. వర్గీకరణపై న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ వర్గీకరణ చర్యలకు వ్యతిరేకంగా, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన, ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఎస్సి రిజర్వేషన్ ల శాతాన్ని 15 నుండి 20 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 12 వేల బ్యాక్ లాగ్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయాలని, ఎస్సి, ఎస్టీ ల సమగ్రాభి వృద్ధికి ఉద్దేశించిన సబ్ ప్లాన్ నిధులను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాలమహానాడు జాతీయ ఉపాధ్యక్షులు, వల్లం సురేష్, రాష్ట్ర, ప్రధాన కార్యదర్శి, నక్కా దేవేందర్ రావు, గ్రేటర్ అధ్యక్షులు, అక్కిదాసరి రవీంద్ర బాబు, తెలంగాణ బేగరి సంక్షేమ సంఘం అధ్యక్షులు, పి. సు చెందర్ తదితరులు పాల్గొన్నారు.