హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఫార్మాసిటీ భూసేకరణ ప్రక్రియపై తాజాగా అభ్యంతరాలు సేకరించి కొనసాగించాలం టూ సింగిల్ జడ్జి గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీ లు దాఖలు చేసింది. చట్టప్రకారం పరిహారాన్ని ప్రకటించినా సింగిల్ జడ్జి పట్టించు కోకపోవడాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి, టీఎస్‌ఐఐసీ అప్పీలు దాఖలు చేశాయి. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ పరిహారం అవార్డు జారీలో చట్టప్రకారం వెళ్లామన్నారు. వీటిని సింగిల్ జడ్జి పట్టించుకోలేదని తెలిపారు.
భూసేకరణ పరిహారాన్ని నోటిఫికేషన్ తేదీనాటి మార్కెట్ విలువ కాకుండా తీర్పు వెలువరించిన 2023 ఆగస్టు నుంచి లెక్కించాలంటూ ఆదేశాలు ఇవ్వడం సరికాదన్నారు. పరిహారం అవార్డుపై చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేశారని తెలిపారు. అప్పీలు వేయడంలో జరిగిన జాప్యాన్ని మన్నించాలని కోరుతూ మధ్యంతర పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతివాదులైన రైతుల తరఫు సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి సింగిల్ జడ్జి తీర్పుపై ఏడాది తరువాత అప్పీలు దాఖలు చేయడంలో జాప్యంపై అభ్యంతరాలున్నాయని అన్నారు. వాటిపై కౌంటరు దాఖలు చేస్తామనడంతో ధర్మాసనం అనుమతిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.