ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి...
కడ్తాల్ (విజయక్రాంతి): ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలను అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, పార్టీలు, వర్గాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అర్హులకు అమలు చేస్తామని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్పష్టం చేశారు. గురువారం కడ్తాల్ మండలం మైసిగండి గ్రామంలో గ్రామసభకు అయన ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ప్రజల సాధక బాధకాలు,అభిప్రాయాలు తెలుసుకుని వారికి ఏ రకంగా సేవచేయాలని గ్రామ సభలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ముందే చెప్పినట్లు 200 యూనిట్లు విద్యుత్, ఉచిత బస్సుప్రయాణం, గ్యాస్ సిలిండరు ఇచ్చామని, ఇప్పుడు ఇందిరమ్మ పేరిట ఇండ్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులను కూడా అర్హులందరికి అందజేస్తామన్నారు. గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. జాబితాలో పేర్లు లేని వారు నిరాశ చెందకుండా అధికార యంత్రాంగానికి దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. మైసిగండి గ్రామంలో సీసీ రహదారులు, వాటర్ ట్యాన్కులు, లో ఓల్టేజి సమస్య, ఎక్స్ ప్రెస్ బస్సులు ఆపడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గీత నర్సింహా, వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, పిసిసి సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, ఎంపిడిఓ సుజాత, ఏఓ శ్రీలత, మాజీ సర్పంచు తులసీరామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.