18-02-2025 06:37:20 PM
హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఇటీవలి సామాజిక ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులాల సర్వే ద్వారా ముస్లింలను ఓబీసీ(Other Backward Class) కేటగిరీలో చేర్చిందని బీజేపీ తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ(Mohammed Ali Shabbir) ఆరోపించారు. మత విభేదాలు సృష్టించేందుకు, కాంగ్రెస్ ప్రభుత్వంపై ముస్లిమేతర ఓబీసీలను రెచ్చగొట్టేందుకు బీజేపీ వాస్తవాలను వక్రీకరిస్తోందని షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కేంద్రమంత్రులు(Union Ministers) కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌లు చేస్తున్న వాదనలు వాస్తవం కాదనీ, కేంద్రం, పలు రాష్ట్రాల్లోనూ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు కూడా ముస్లిం వర్గాలను ఓబీసీలుగా వర్గీకరించాయని ఆరోపించారు.
బీజేపీ నేతలు(Bharatiya Janata Party leaders) విభజన రాజకీయాలు చేస్తున్నారని, వెనుకబడిన వర్గాలను తప్పుదోవ పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగా చారిత్రక వాస్తవాలను వక్రీకరించారని ఆరోపించారు. కాంగ్రెస్, భాజపా నేతృత్వంలోని ప్రభుత్వాల హయాంలో అనేక దశాబ్దాలుగా ముస్లిం వర్గాలు ఓబీసీ జాబితాలో భాగమయ్యాయని ఎత్తిచూపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే అనేక కమీషన్లు ముస్లిం వెనుకబడిన వర్గాలను ఓబీసీ (OBC)లుగా గుర్తించాయని రుజువు చేసే చారిత్రక నివేదికలు, ప్రభుత్వ రికార్డులతో షబ్బీర్ అలీ తన వాదనను సమర్థించారు. ఈ నివేదికల కాపీలను తాను ఈమెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా బిజెపి నేతలకు పంపుతానని, వారికి ఏదైనా స్పష్టత అవసరమైతే వారిని వ్యక్తిగతంగా కలుస్తానని చెప్పారు.
అయితే, ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో ఉండి, అధికారిక రికార్డులు అవే అందుబాటులో ఉన్నప్పటికీ బీజేపీ(Bharatiya Janata Party ) నేతలు అమాయకులలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ముస్లిం రిజర్వేషన్లు తమ అవకాశాలను తగ్గిస్తున్నాయని తప్పుడు ప్రచారం చేస్తూ బీజేపీ ఉద్దేశపూర్వకంగా ముస్లిమేతర ఓబీసీలలో భయాన్ని సృష్టిస్తోందన్నారు. తెలంగాణలో ముస్లిం ఒబిసిల(Muslim OBCs)కు నాలుగు శాతం రిజర్వేషన్లు గ్రూప్ ఈ కింద ప్రత్యేక కోటా అని, దీని అర్థం ముస్లిమేతర ఒబిసిల వాటాపై ప్రభావం చూపదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయం బీజేపీకి బాగా తెలుసు కానీ రాజకీయ మైలేజీ కోసం అసత్యాలు ప్రచారం చేస్తోందన్నారు. బహుళ రాష్ట్రాల్లోని బిజెపి ప్రభుత్వాలు ముస్లింలకు ఒకే ఒబిసి వర్గీకరణను అనుసరించాయని, వారి ఆరోపణలు రాజకీయ ప్రేరేపిత కపటమని రుజువు చేశాయని షబ్బీర్ అలీ గుర్తు చేశారు.