గత పాలకుల నిర్లక్ష్యం.. పేరుకుపోయిన పెండింగ్ బిల్లులు
- పదుల సంఖ్యలో ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు
- స్థానిక సంస్థలకు రూ.10,170 కోట్ల కేటాయింపులు
- రూ.5,988 కోట్లు మాత్రమే విడుదల
- సుమారు 42 శాతం నిధుల దారి మళ్లింపు
హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచులు నిరసన తెలుపుతూ ఆందోళనలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో పూర్తి చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
వాస్తవానికి పెండింగ్ బిల్లుల సమస్యతో మాజీ సర్పంచులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పదేళ్ల కాలంలోనే అనేక విషాద ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. పదుల సంఖ్యలో సర్పంచులు ఆత్మహత్య, ఆత్మహత్యాయత్నం కూడా చేశారు.
ప్రస్తుతం మాజీ సర్పంచులు చేపడుతున్న ఆందోళనలో న్యాయం ఉన్నప్పటికీ అసలు సమస్యకు కారణంపైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంద ని, సమస్యకు కారణమైన గత పాలకులే ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నదని కాంగ్రెస్ ప్రభుత్వం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నది.
ఈ ఆందోళన చిలికి చిలికి గాలి వాన అయిన చందానా గత పదేళ్లలో జరిగిన నిర్లక్ష్యంతో సర్పంచులకు చేరాల్సిన నిధులు ఏటేటా పెరిగి వేల కోట్లు పెండింగ్ పడ్డాయి.
వారి ఆదేశాలతోనే పనులు
గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులు సర్పంచులతో బలవంతంగా పనులు చేయించారనే ఆరోపణలూ ఉన్నాయి. వారి ఆదేశాలతోనే సర్పంచులు లక్షలాది రూపాయలు అప్పు చేసి మరి గ్రామాల్లో పనులు చేశారు. అయితే, పంచాయతీల్లో పనులు చేయాలంటే నిర్ధిష్ట నిబంధనలు పాటించాలి. మొదట పంచాయతీ అనుమతి పొందాలి.
తర్వాత పనుల అంచనాలు సిద్ధం చేయాలి. ప్రభుత్వం వాటికి అనుమతులు జారీచేస్తుంది. అనంతరం టెండర్ ప్రక్రియ ద్వారా పనులు చేపట్టాలి. పనులు పూర్తయ్యాక మెజర్మెంట్ బుక్కుల్లో రికార్డులు నమోదు చేసి దశలవారీగా బిల్లులు విడుదల చేస్తారు. గతంలో ఈ ప్రక్రియను అనుసరించకుండానే కేవలం నోటి మాట ద్వారా గ్రామ పంచాయతీల్లో పనులు చేయించారు.
కానీ, సర్పంచులకు బిల్లులు మాత్రం చెల్లించలేదు. దీంతో పదేళ్ల పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలంటే చాలా చిక్కులు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. చేసిన పనులు, బిల్లులను సమగ్రంగా పరిశీలించే ప్రక్రియ చివరి దశలో ఉందని తెలుపుతున్నారు. ఇప్పటికే ఉపాధి హామీ ద్వారా చేసిన పనులకు సంబంధించిన రూ.500 కోట్లకు పైగా బిల్లులను మాజీ సర్పంచులకు చెల్లించినట్టు పేర్కొంటున్నారు.
42 శాతం నిధులు గాయబ్
వాస్తవానికి గత పదేళ్లలో స్థానిక సంస్థలకు ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులను రూ.10,170 కోట్లు కేటాయించింది. కానీ, అందులో రూ.5,988 కోట్లు మాత్రమే విడుదల చేసింది. దీంతో రూ.4,181 కోట్ల నిధులు పెండింగ్ ఉన్నాయి. మొత్తం కేటాయించిన నిధుల్లో 42 శాతం ఇంకా చెల్లించాల్సి ఉంది.
ఈ గణాంకాలను పరిశీలిస్తే గ్రామ పంచాయతీలకు చేరాల్సిన దాదాపు సగం నిధులను గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టినట్టు స్పష్టమవుతోంది. దీంతో గ్రామ పంచాయతీలకు నిధుల కొరత ఏర్పడింది. పల్లెల్లో అభివృద్ధి కుంటుపడింది. ప్రజల అవసరాలను తీర్చేందుకు ముందుకొచ్చి సర్పంచులు లక్షలు ఖర్చు చేసి ఇబ్బందుల పాలయ్యారు.
ఈ క్రమంలో పదేళ్ల కాలంలో నాటి నుంచి పేరుకుపోతూ వస్తున్న పెండింగ్ బిల్లుల సమస్యతో మాజీ సర్పంచులు ఇప్పటికీ సతమతమవుతున్నారు. ఇప్పటికైనా పెండింగ్ బిల్లులను చెల్లించి వారిని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
పలు విషాద ఘటనలు
* 2021లో సిరిసిల్ల నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలం సోమారంపేట సర్పంచ్ వడ్డే ఆనంద్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.
* 2023లో హనుమకొండ జిల్లా పరకాల మండలం హైబోట్‌పల్లి సర్పంచ్ కంచ కుమారస్వామి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయన కట్టించిన శ్మశాన వాటికలో ఆయనదే తొలి దహన సంస్కారం కావడం బాధకరం.
* 2021 ఏప్రిల్‌లో రంగారెడ్డి జిల్లా కాషగూడెం సర్పంచ్ అజారుద్దీన్ పనులకు సంబంధించిన బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్నాడు.
* సంగారెడ్డి జిల్లా నాగిల్‌గిద్ద మండలం మావినేల సర్పంచ్ చంద్రప్ప ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
* మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండలం శ్రీరాములపల్లి సర్పంచ్ మంజుల ఆత్మహత్యాయత్నం చేశారు.
* 2022 నవంబర్‌లో వికారాబాద్ జిల్లా యాలాల మండలం తిమ్మాయిపల్లి సర్పంచ్ అపర్ణ కూడా ఆత్మహత్యాయత్నం చేశారు.
* 2022లో నాగర్‌కర్నూల్ జిల్లా అవసులకుంట సర్పంచ్ ఎల్లయ్య బిల్లులు రాక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
* పెండింగ్ బిల్లులు సమయానికి రాకపోవడంతో నల్లగొండ జిల్లా మునుగోడు సర్పంచ్ మిర్యాల వెంకన్న భిక్షాటన చేసి నిరసన తెలిపారు.