calender_icon.png 29 October, 2024 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి రైతుల గోస

29-10-2024 02:55:57 AM

క్వింటాల్‌కు కేవలం రూ.6,8౦౦.. తేమ సాకుతో ధర తగ్గిస్తున్నారని ఆవేదన

అగ్గువకు అమ్మేదెట్ల..

ఖమ్మం/ కామారెడ్డి/ ఆదిలాబాద్ / వరంగల్, అక్టోబర్ 28 (విజయ క్రాంతి): అకాల వర్షాలు.. చీడ పీడల నుంచి పంటను కాపాడుకుని, చేతికొచ్చిన పత్తిని వ్యయప్రయాసల కోర్చి మార్కెట్‌కు తీసుకొస్తే, మార్కెట్‌లో రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. దీపావళి సమీపిస్తున్న వేళ దర్జాగా పంటను మద్దతు ధరకు విక్రయించి.. పిల్లాపాపలతో పండుగ జరుపు కొందామనుకుంటే నిరాశ ఎదురవుతున్నది.

ఖమ్మం ఏఎంసీకి సోమవారం సుమారు 1,500 మంది రైతులు 35 వేల బస్తాల పత్తిని తీసుకొచ్చారు. సీసీఐ ధర ప్రకారం క్వింటాకు రూ.7,521- 7,370 వరకు రైతులకు చెల్లించాల్సి ఉంది. కానీ, సోమవారం మార్కెట్‌లో ధర సగటున రూ.క్వింటాల్‌కు 6,800, తక్కువలో తక్కువ రూ.5,900 పలికింది.

వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి, పంట పండిస్తే మార్కెట్‌లో కనీస ధరలు కూడా లేవని రైతులు వాపోయారు. దీపావళి పండుగ వేళ ఎంతకో అంతకు విక్రయించామని, తేమ శాతం  పేరుతో వ్యాపా రులు తమ కష్టాన్ని దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంత జరుగుతున్నా మార్కెటింగ్‌శాఖ అధికారులు ఏమీ పట్టనట్లు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కామారెడ్డి జిల్లాలో సిండికేట్..

కామారెడ్డి జిల్లాలో ప్రైవేటు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ఒకే ప్రైవేట్ జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొంటున్నారు. రైతులు ఇక్కడికి ప్రతిరోజూ 500 800 క్వింటాళ్ల పత్తి తరలిస్తున్నారు. వ్యాపారులు క్వింటాకు నాణ్యతను బట్టి రూ.6,850 నుంచి రూ.7,200 ధర నిర్ణయించి కొంటున్నారు.

ప్రభుత్వం సీసీఐ ద్వారా కొనుగోళ్లు చేపడితే మంచి ధర వస్తుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్రైవేట్ జిన్నింగ్ మిల్లుల వ్యాపారులు సీజన్ ముందే కొనుగోళ్లు ప్రారంభించారని మండిపడుతున్నా రు. అసలే అకాల వర్షాలతో దిగుబడి తగ్గిందంటే, చేతికొచ్చిన పత్తికి కూడా వ్యాపారు లు తక్కువ ధర ఇస్తున్నారని వాపోతున్నారు.

ఆదిలాబాద్‌లో సాఫీగా కొనుగోళ్లు..

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో సోమవారం కింటా పత్తికి ధర రూ.7,521 పలికింది. అలాగే ప్రైవేట్‌లో క్వింటా ధర రూ.7,120 పలికింది. సోమవారం సాఫీగా పత్తి కొనుగోలు ప్రక్రియ సాగింది. శనివారంతో పోలిస్తే సోమవారం సీసీఐ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కొనుగోళ్లు ప్రారంభమైన తొలిరోజు తేమ శాతం విషయంలో ధర తగ్గడంతో రైతులు ఆందోళన చేపట్టారు.

ఏనుమాముల మార్కెట్‌లో మంచి ధర..

వరంగల్ ఏనుమాముల మార్కెట్‌కు రైతులు పత్తిని భారీగా తీసుకొస్తున్నారు. రోజురోజుకు మార్కెట్‌కు పత్తి పోటెత్తుతున్నది సోమవారం మార్కెట్‌కు భారీగా పత్తి బస్తాలు అమ్మకానికి వచ్చాయి. రైతులు సుమారు 10 వేల బస్తాలను తీసుకొచ్చారు. దీంతో యార్డు కళకళలాడింది. క్వింటా పత్తికి మార్కెట్‌లో రూ.7,521 పలికింది. మంచి రేటు దక్కడంతో రైతులు ఎలాంటి ఆందోళన చేయకుండానే పత్తిని విక్రయించారు.

ఏఎంసీల్లో దోపిడీని అరికట్టాలి

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్‌రావు

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): ఏఎంసీలకు పత్తి తరలించిన రైతులను వ్యాపారులు దోపిడీ చేస్తున్నారని, ప్రభుత్వం స్పందించి దోపిడీని అరికట్టాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌రావు సోమవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. సర్కార్  హామీ ఇచ్చిన విధంగా క్వింటాల్‌కు రూ.475 బోనస్ ఇవ్వాలన్నారు.

ప్రస్తుతం పత్తికి రూ.6 వేల నుంచి అత్యధికంగా రూ.7 వేల వరకు మాత్రమే ధర లభిస్తున్నదన్నారు. రైతులు పెట్టిన పెట్టుబడికి 50శాతం కలిపి కనీస మద్దతు ధరలు ఇవ్వాలని కోరారు. ఆ ప్రకారం పత్తికి క్వింటాకు రూ.7,521 చొప్పున ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలను తగ్గించారని, నాణ్యతా ప్రమాణాలతో సాకుతో రైతులను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.