calender_icon.png 15 March, 2025 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రిష్ణయ్య పూజకోసం గోపికల పిలుపు

17-12-2024 12:00:00 AM

తిరుప్పావై సిరినోము 

వైయత్తు వాళ్వీర్గాళ్ నాముమ్ నమ్బావైక్కు

శెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో, పాఱ్కడలుళ్

పైయ త్తుయిన్ఱ పరమ నడిపాడి,

నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి,

మైయిట్టెళుదోమ్ మలరిట్టు నాముడియోమ్

శెయ్యాదన శెయ్యోమ్ తీక్కురళై చ్చెన్ఱోదోమ్,

ఐయముమ్ పిచ్చైయు మాన్దనైయుమ్ కైకాట్టి,

ఉయ్యుమాఱెణ్ణి ఉగన్దేలో రెమ్బావాయ్ (తమిళ)


గోదా గోవింద గీతం

సౌభాగ్యసుదతులార, ఇది ఇడుముల బెట్టువ్రతముకాదు

పరమానందబ్రహ్మము చేర్చునోము నియమాలు తెలియరండి

పాలకడలి నాథుడి పాలు మనము, వేరు పాలు మనకేలమగువలార

కృష్ణయ్య నెయ్యము సాధింప నెయ్యి మానుదాము పూబోడులార

తెల్లారి స్నానాలు కద్దు, పూలు కాటుకల సొబగులొద్దు

చేయరాని పనులు వద్దన్న చేయకుండుటె మేలు, చాడీలు, 

మనసు నొప్పించు విరుపులొద్దు, హితవులు వినడమే మనకు మంచి

దానధర్మాలతో నడచి దామోదరుని చేరుటే మన తిరునోము దారి(తెలుగు)

‘వైయత్తు వాళ్ వీర్ గాళ్’, ఈ భూమిమీద ఆనందంగా ఉండాలనుకుం టే రండి. నాముం నంపావైక్కు..’ ఈ వ్రతం కష్టపెట్టడానికి కాదు. ‘శెయ్యుం కిరిశైగళ్ కేళీరో..’ ఏం చేద్దామో వినండి. ‘పాఱ్కడలుళ్ పైయత్తు యిన్ఱ పరమనడిపాడి...’ పాలకడలిలో సుకుమారంగా శయనించి ఉన్న వైకుంఠ నాథుడి పాదాలను పట్టుకుందాం.

‘నెయ్యుణ్ణోం పాలుణ్ణోం’ నెయ్యీ వద్దు, పాలూ వద్దు. ‘నాట్కాలే నీరాడి’ తెల్లారు జామున స్నానం చేద్దాం. ‘మైయెట్టుళుదోం మలరిట్టు నాం ముడియోమ్’ కనులకు కాటుక పెట్టుకోం, కొప్పులో పూలు ముడవం, విలాసాలు వదిలేద్దాం. ‘శెయ్యాదన శెయ్యోం’ చెయ్యకూడదని పెద్దలు చెప్పినవి చెయ్యం. ‘తీక్కుఱళైచ్చెన్ణోదోమ్’ మరొకరి మనసు కష్టపెట్టే పుల్లవిరుపు మాటలు మాట్లాడం. ‘ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి’ చేతనైనంత వరకు దానాలు చేస్తాం. ‘ఉయ్యమాఱెణ్ణి ఉగంద్’ ఈ పనులన్నీ ఆనందంతో చేస్తాం.

శూర్పణఖతో రామలక్ష్మణుల వివాదం

‘నారాయణ వ్రతం చేద్దాం రమ్మని పిలిస్తే ఇంత మంది వచ్చారా’ అని ఆండాళ్ ఆశ్చర్యపోయిందట. సరే నోములో ‘చేయకూడనివి, చేయవలసినవి చెప్పుకుందాం’ అన్నారు. వ్రతం చేసే అధికారి సంభవిత సంభవములగురించి తెలుసుకోవలసి ఉంటుంది.

రెండో పాటలో రాముని కథ వివరిస్తున్నారు గోదమ్మ. వైయత్తు వాళ్ వీర్ గాళ్, ఈ భూమిమీద ఆనందంగా ఉండాలనుకుంటే రండి. భూమి తామస గుణం ఇస్తుందట. భూమిమీద ఉండగా సాత్విక గుణం కలగడం అంటే కుంపెటలో తామరపువ్వు పూసినట్టు. భగవంతుడే రాముడై వస్తే భూమిమీద తామస గుణ ప్రభావానికి లోనైనాడు. హనుమతో సీత ఈ విధంగా అన్నారట. ‘ఈ భూమిమీద ఉండగా తప్పు చేయడం సహజం, నీవు చూసి రమ్మంటే కాల్చి వెళ్తున్నావు అది తప్పు కాదా’.

‘నేనంటే తప్పు చేసానేమో మరి, రాముడు కూడా తప్పు చేసాడా తల్లీ’ అని ప్రశ్నించాడు హనుమ. ‘కాదా మరి.. శూర్పణఖ వచ్చి వలచినానని చెప్పినప్పుడు నేను ఏకపత్నీ వ్రతుడను అని నిరాకరిస్తే సరిపోయేది కదా, కాని తమ్ముడిని చూపడం, వేళాకోళం చేయడం అవసరం లేని పనే కదా. అనేక పరిణామాలకు ఆనాటి ఘటనలే కారణం కాదా?’.

నిజానికి తండ్రి తనకు రాజ్యం ఇచ్చినా, అన్న రాముడు ఏలుకొమ్మని ఆదేశించినా, ఋషులు, తల్లులు, పెద్దలు పరిపాలించమని కోరినా, గురువు తప్పు లేదని చెప్పినా, భరతుడు రాముని పాదాలనే ఆశ్రయించాడు. ఆయన ధరించిన పాదుకలనే కోరుకున్నాడు. ఎందుకంటే, సూర్యవంశంలో సింహాసనం ఎప్పుడూ పెద్ద కొడుకుకేగాని చిన్నవాడు అధిరోహించరాదు. అన్న సజీవుడై ఉండగా తమ్ముడు రాజ్యాన్ని పాలించడం జరగదు.

ఆ శిష్టాచారమే ధర్మమని పెద్దలు నుడివిన మాట, నడిచిన బాటను భరతుడు పాటించాడు. మనసా వాచా రామపాదాన్ని రాజ్య వైభవాలకన్నా మిన్నగా భావించిన భాగవతోత్తముడు, పరమభక్తుడు భరతుడు. తిరుప్పావైలో శ్రీకృష్ణుడి కథలతోనేకాక రామకథ కూడా నడుస్తుంటుంది. ‘అర్థాలు, అంతరార్థాలు అర్థం చేసుకుంటే శ్రీరామ శ్రీకృష్ణుల తత్వం, రామాయణ భాగవతాలు మనకు సందేశాలిస్తూ ఉంటాయి’ అన్నారు గోదమ్మ.

పరుల గురించి చెడు పలకని లక్షణం వైష్ణవ లక్షణం. ‘వైష్ణవ జనతో తేనే కహియే పీడ్ పరాయీ జానీరే...’ ఇతరుల బాధలు తెలిసిన వాడినే వైష్ణవుడంటారని మీరా భజన బోధిస్తున్నది. మనసులో కూడా పరుల చెడు ఆలోచించరాదు. ఎందుకంటే, మనసులో మెదిలే ఆలోచన అంతర్యామికి తెలిసిపోతుందని తెలుసుకోవాలి కనుక. ‘అంతరంగ మందు అపరాథములు చేసి, మంచివాని వలెను మనుజుడుం డు, ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా, విశ్వదాభిరామ వినురవేమ’ అని వేమన అన్నాడు. 

-మాడభూషి శ్రీధర్