దేశంలోనే మొదటిది
- రాష్ట్ర ప్రభుత్వంతో కీలక ఒప్పందం.. వేలాదిమందికి ఉపాధి అవకాశం
- సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబుతో గూగుల్ ప్రతినిధుల భేటీ
- డిజిటల్ స్కిల్ డెవలప్‌మెంట్‌లో తెలంగాణ ముందంజ అని కితాబు
హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం గూగుల్ కంపెనీతో కీలక ఒప్పందం చేసుకున్నది. దేశంలోని మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్(జీఎస్‌ఈసీ)ని హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు గూగుల్ కంపెనీ ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో స్థాపించే జీఎస్‌ఈసీ ప్రపంచంలోనే ఐదవది కావడం విశేషం.
ఏషియా పసిఫిక్ జోన్‌లో టోక్యో తర్వాత ఈ సంస్థ రెండో సెంటర్‌ను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తున్నది. గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ప్రత్యేకమైన అంతర్జాతీ య సైబర్ సెక్యూరిటీ హబ్. ఇది అధునాతన భద్రత, ఆన్‌లైన్ భద్రతా ఉత్పత్తు లను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
అత్యాధునిక పరిశోధన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భద్రత, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, పరిశోధకులకు ఈ సేఫ్టీ సెంటర్ సహకార వేదికగా ఉపయోగపడుతుంది. దేశంలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి, ఉపాధి పెంచడం, సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాలు పెంపొందించే లక్ష్యంగా ఈ సెంటర్ పనిచేస్తుంది.
ఇప్పటికే భారీసంఖ్యలో ఉద్యోగులున్న గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో నిర్మిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 3న జరిగిన గూగుల్ ఫర్ ఇండియా కాన్‌క్లేవ్‌లోనే సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ఏర్పాటు విషయాన్ని ఆ కంపెనీ ప్రకటించింది. అప్పటి నుంచి జీఎస్‌ఈసీని తమ రాష్ర్టంలోనే నెలకొల్పాలని, గూగుల్ పెట్టుబడులను ఆహ్వానించేందుకు వివిధ రాష్ట్రాలు పోటీపడ్డాయి.
సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సందర్భంగా గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అప్పటినుంచి హైదరాబాద్‌లో ఈ అత్యాధునిక సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది. హైదరాబాద్‌లో ఈ సేఫ్టీ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు గూగుల్ ముందుకు రావటం చాలా ఆనందంగా, గర్వంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
గూగుల్‌తో రాష్ర్ట ప్రభుత్వ భాగస్వామ్య ఒప్పందం చేసుకోవటంతో మరోసారి హైదరాబాద్ ప్రపంచంలో మేటి ఐటీ, ఇన్నోవేషన్ హబ్‌గా అందరి దృష్టిని ఆకర్షిస్తుందన్నారు. గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హాన్సెన్ అధ్వర్యంలోని కంపెనీ ప్రతినిధి బృందం బుధవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా హాన్సెన్ మాట్లాడుతూ.. డిజిటల్ స్కిల్ డెవలప్‌మెంట్‌లో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ, ఐటీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అభివృద్ధికి హైదరాబాద్ కేంద్రంగా ఉందని కితాబిచ్చారు. ఇప్పటికే ప్రపంచంలో పేరొందిన అయిదు టెక్ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, అమెజాన్, ఫేస్‌బుక్ ఇక్కడే ఉన్నాయని పేర్కొన్నారు.
ఇప్పుడు సేఫ్టీ సెంటర్ ద్వారా సైబర్ సేఫ్టీ సమస్యలను వేగంగా పరిష్కరించే వీలుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సెంటర్ ఏర్పాటుతో వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.