14-02-2025 01:34:18 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ గూగు ల్ హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా ఏఐ యాక్సిలేటర్ సెంటర్ ఏర్పాటు చేయనున్నదని, సెంటర్ ద్వారా కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని టీ హబ్‌లో గురువారం ఆయ న ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఏఐ యాక్సిలేటర్ సెంటర్ ఏర్పాటుకు గూగుల్ డిజిటల్ ఇండియాతో ఎంవోయూ చేసుకుని సంతకా లు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఏఐ సాంకేతికతతో ప్రజలకు మెరుగైన పాలన అందించవచ్చ న్నారు.
ఆర్థిక పురోగతిలో ఏఐ ముఖ్యపాత్ర పోషిస్తుందని తెలిపారు. కీలక రంగాల్లో ఏఐ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు గూగుల్ వంటి దిగ్గజ సంస్థతో ఒప్పందం చేసుకోవడం ఆనందాన్నిచ్చిందన్నారు. గూగుల్‌తో ఒప్పందం తమ ప్రభుత్వ డిజిటల్ ప్రయాణంలో కీలకమైన ఘట్టమని అభివర్ణించారు.
భవిష్యత్తు లో అమలు చేయబోయే విధానపరమైన నిర్ణయాలకు ఏఐ వర్క్‌ఫోర్స్‌గా పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో పీఏసీ చైర్మన్ గాంధీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఏఐతో నైపుణ్యాల మెరుగు: గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్ ప్రీతి లోబానా
తెలంగాణతో భాగస్వామ్యం ‘గూగుల్ డిజిటల్ ఇండియా’ ప్రయాణాన్ని మరింత పటిష్టం చేస్తుందని గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్ ప్రీతి లోబానా ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి తాము ఏఐలో అత్యద్భుతమైన నైపుణ్యాలు అందిస్తామన్నారు. స్టార్టప్ ఆవిష్కర ణలను ప్రోత్సహిస్తామని తెలిపారు. వ్యవసాయం, విద్య వంటి కీలక రంగాల్లో ఏఐని వినియోగించుకునేందుకు సాంకేతికతను సిద్ధం చేస్తామన్నారు.
మార్పునకు నాంది
గూగుల్ ఇండియా, తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యంతో రాష్ట్రాభివృద్ధికి బాటలు పడతాయి. విద్య, వ్యవసాయం, మొబిలిటీ, డిజిటల్ ఇన్‌ఫ్రాతో పాటు పరిపాలన విభాగంలో ఏఐని అనుసంధానించి సత్ఫలితాలు రాబట్టొచ్చు. ఆయా రంగాల్లో జటిలమైన సమస్యలకు ఏఐ ద్వారా తక్షణ పరిష్కార మార్గాలు తెలసుకోవచ్చు. కొత్త ఆవిష్కరణలకు బాటలు వేయొ చ్చు. యువతలో నైపుణ్యాలను పెంపొందించొచ్చు.
గూగుల్ ఏఐ సేవలు
* నైపుణ్యాల పెంపుతో ఉద్యోగ, ఉపాధి రంగాలకు ఊతం
* ఏఐ ఆధారిత అగ్రికల్చర్ విధానాలతో వ్యవసాయం లాభసాటి
* రైతుల కోసం అందుబాటులోకి ఓపెన్ అగ్రికల్చర్ నెట్‌వర్క్
* ట్రాన్సిట్ డేటా ఇంటిగ్రేషన్‌తో మెరుగైన రవాణా వ్యవస్థ
* గూగుల్ ఫర్ ఎడ్యుకేషన్‌తో విద్యార్థులకు డిజిటల్ లెర్నింగ్
* గూగుల్ డేటా కామన్స్‌తో మెరుగైన ఓపెన్ డేటా యాక్సెస్
* గూగుల్ సోలార్ ఏపీఐతో సమర్థంగా సౌరశక్తి వినియోగం