జనగామ, నవంబర్ 26 (విజయక్రాంతి): కాళ్లకు చెప్పులు లేకుండా ఎండ లో దీనస్థితిలో నడుస్తున్న ఓ బాలికను చూసి మంత్రి కొండా సురేఖ చలించిపోయారు. తన కాన్వాయ్ ఆపి ఆ పాపకు చెప్పులు, దుస్తులు కొనిచ్చి ఉదారతను చాటుకున్నారు. మంత్రి కొండా సురేఖ మంగళవారం పెద్దపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వరంగల్ నుంచి బయలుదేరారు.
మార్గమధ్యంలో సుల్తానాబాద్ మార్కెట్ చౌరస్తా వద్ద బిహార్‌కు చెందిన ఓ బాలిక కాళ్లకు చెప్పులు లేకుండా ఎండలో వెళ్తుండటాన్ని మంత్రి గమనించారు. వెంటనే తన కాన్వాయ్ ఆపి పాప దగ్గరికి వెళ్లారు. దగ్గ రే ఉన్న చెప్పుల షాపులోకి తీసుకెళ్లి రెండు జతల చెప్పులు కొనిచ్చారు. పక్కనే ఉన్న వస్త్ర దుకాణానికి తీసుకెళ్లి దుస్తులు కొనిచ్చారు.
పాప తల్లిదండ్రులతో మాట్లాడగా బతుకుదెరువు కోసం తెలంగాణకు వచ్చి కూలీ పనులు చేసుకుంటున్నట్లు తెలిపారు. మంత్రి కొండా సురేఖ కాన్వాయ్ ఆపి బాలికకు చెప్పులు, దుస్తులు కొనివ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది.