calender_icon.png 15 November, 2024 | 8:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్త జనసంద్రమైన గూడెం గుట్ట

15-11-2024 06:08:24 PM

కిటకిటలాడిన ఆలయాలు గోదావరీ నదీ తీరం...

వ్రతాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు...

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట, సమీప గోదావరీ నదీ తీరం భక్త జనసంద్రమైంది. కార్తీక పౌర్ణమిని పురష్కరించుకొని భక్తులు ఉదయం నుంచే గూడెం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతమంటపంలో వ్రతాలు ఆచరించారు. అంతకు ముందు సమీప గోదావరీ నదీ తీరంలో పెద్ద ఎత్తున భక్తులు గోదావరి స్నానం చేసి గోదారమ్మకు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. గూడెం మెట్ల వద్ద ఉదయం నాలుగు గంటల నుంచే పెద్ద ఎత్తున భక్తులు దీపారాధన చేశారు. 365 వత్తులను ఉసిరికాయలో కాల్చారు. ప్రతాలు చేసుకున్న భక్తులు అక్కడే కుటుంబ సభ్యులతో కలిసి భోజనాలు చేశారు. సత్య దేవుడిని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు దంపతులు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో పాటు నాయకులు, అధికారులు దర్శించుకున్నారు. 

కిటకిటలాడిన సమీప ఆలయాలు...

గూడెం సత్యనారాయణ స్వామి సమీప ఆలయాలైన అయ్యప్ప, సాయిబాబా, సదానందయ్య, భక్తాంజనేయ ఆలయాలకు భక్తుల తాకిడి పెరిగింది. పెద్ద మొత్తంలో భక్తులు దర్శించుకున్నారు. టీజీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో గూడెంకు ప్రత్యేక బస్సులు నడిపించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆధ్వర్యంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, లక్షెట్టిపేట సీఐ నరేందర్, దండేపల్లి, లక్షెట్టిపేట ఎస్సైలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు.