calender_icon.png 1 November, 2024 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయంతో వీడ్కోలు

15-05-2024 12:41:39 AM

చివరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ గెలుపు 

లక్నో ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు! 

అభిషేక్, స్టబ్స్ మెరుపులు

ఐపీఎల్--17వ సీజన్‌లో భాగంగా తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సమష్టిగా సత్తాచాటింది. అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలుపు తప్పనిసరైన పోరులో లక్నోను చిత్తుచేసి ప్రథమ కర్తవ్యాన్ని పూర్తిచేసింది. ప్లే ఆఫ్స్ చేరేందుకు మెరుగైన అవకాశాలు ఉన్న లక్నో ఈ ఓటమితో దారులు మరింత క్లిష్టం చేసుకుంది. 

మెక్‌గుర్క్ విఫలమైనా.. అభిషేక్ పొరెల్, స్టబ్స్ అర్ధశతకాలతో కదంతొక్కడంతో సొంతగడ్డపై మొదట ఢిల్లీ భారీ స్కోరు చేయగా.. ఆనక వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ.. తన అనుభవాన్నంతా రంగరించి లక్నో సూపర్ జెయింట్స్‌కు కళ్లెం వేశాడు. పూరన్, అర్శద్ పోరాడినా ఫలితం లేకపోయింది!

ఢిల్లీ: ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విఫలమైంది. బౌలింగ్, బ్యాటింగ్‌లో మెరుపులు కనబర్చలేకపోయిన రాహుల్ సేన లీగ్‌లో ఏడో పరాజయం మూటగట్టుకుంది. మరోవైపు సీజన్‌లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. మంగళవారం సొంతగడ్డపై జరిగిన పోరులో ఢిల్లీ 19 పరుగుల తేడాతో లక్నోపై గెలుపొందింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.

అభిషేక్ పొరెల్ (33 బంతుల్లో 58; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (25 బంతుల్లో 57 నాటౌట్; 3 ఫోర్లు, 34 సిక్సర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. విధ్వంసక వీరుడు జేక్ ఫ్రెజర్ మెక్‌గుర్క్ (0) డకౌట్ కాగా.. షై హోప్ (38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ రిషబ్ పంత్ (33; 5 ఫోర్లు) రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసింది. కెప్టెన్ రాహుల్ (5), స్టొయినిస్ (5), డికాక్ (12), దీపక్ హుడా (0), ఆయుష్ బదోనీ (6), కృనాల్ పాండ్యా (18) విఫలం కాగా..

నికోలస్ పూరన్ (27 బంతుల్లో 61; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), అర్శద్ ఖాన్ (33 బంతుల్లో 58 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) దడదడలాడించారు. 71 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును పూరన్ తన హిట్టింగ్‌తో ఊపిరిలూదగా.. ఆఖర్లో అర్శద్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఢిల్లీ బౌలర్లను చీల్చి చెండాడుతూ ఎడాపెడా సిక్సర్లతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇషాంత్ కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. 

నామమాత్రమే..

తాజా సీజన్‌లో నిలకడ కనబర్చలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ లీగ్ దశలో 14 మ్యాచ్‌లాడి 7 విజయాలు, 7 పరాజయాలతో 14 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. తాజా ఫలితంతో ఢిల్లీ పట్టికలో ఐదో స్థానానికి చేరినా.. ఆ జట్టు నెట్ రన్‌రేట్ తక్కువగా ఉండటం ఇబ్బంది కరంగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో పాటు ఢిల్లీ కూడా ప్లే ఆఫ్స్ రేసులోనే కనిపిస్తున్నా..

ఈ రన్‌రేట్‌తో క్యాపిటల్స్ ముందడుగు వేయడం కల్లే! ఇప్పటికే కోల్‌కతా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టగా.. 12 మ్యాచ్‌ల్లో 16 పాయింట్లతో ఉన్న రాజస్థాన్ నాకౌట్ చేరడం కూడా దాదాపు ఖాయమే. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, లక్నో పోటీ పడుతున్నాయి. వీరిలో హైదరాబాద్‌కు మాత్రమే రెండు మ్యాచ్‌లు ఉండగా.. మిగిలిన జట్ల పరిస్థితి క్లిష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో రన్‌రేట్ కీలకంగా కానుండగా.. ఈ అంశంలో చెన్నై, బెంగళూరు మెరుగ్గా ఉన్నాయి.