calender_icon.png 15 January, 2025 | 5:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్విదా వినేశ్

09-08-2024 02:02:07 AM

రెజ్లింగ్‌కు భారత స్టార్ రెజ్లర్ వీడ్కోలు

అనర్హత వేటుతో ఫొగాట్ సంచలన నిర్ణయం

* అనర్హత వేటు.. ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. దేశానికి పతకం తీసుకొస్తుందన్న తరుణంలో కేవలం వంద గ్రాముల బరువు ఆమె కలను దూరం చేసింది. పతకం ఖాయమైన తర్వాత అది మెడలో నుంచి జారిపోతే ఆ బాధ వర్ణణాతీతం. ‘ఇన్నాళ్లు కుస్తీతో చేసిన పోరాటం చాలు.. ఇక పోరాడలేను’ అంటూ బాధాతప్త హృదయంతో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అంతర్జాతీయ రెజ్లింగ్ కెరీర్‌కు గుడ్ బై చెప్పింది.ఇన్నాళ్లు వ్యవస్థతో పోరాడి అలసిపోయిన సివంగి ఇక చాలు అనుకుందేమో.. కుస్తీ పోటీలకు శాశ్వతంగా సెలవు ప్రకటించింది. అల్విదా వినేశ్ ఫొగాట్..

* అమ్మా.. ఇవాళ కుస్తీ నా మీద గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించండి. మీ కల, నా ధైర్యం రెండు విచ్ఛిన్నమయ్యాయి. ఇక నాకు పోరాడే బలం లేదు. గుడ్‌బై రెజ్లింగ్ 2001 మీ అందరికి ఎప్పటికీ రుణపడి ఉంటా..

 వినేశ్ ఫొగాట్

పారిస్: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్ క్రీడకు వినేశ్ వీడ్కోలు పలికి అభిమానులను షాక్ గురిచేసింది. ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50 కేజీల ఫ్రీస్టుల్ విభాగంలో ఫైనల్ చేరిన వినేశ్‌పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. కేవలం వంద గ్రాముల అధిక బరువు కారణంగా ఒలింపిక్ కమిటీ ఆమెపై అనర్హత వేటు వేసింది. దీంతో కుస్తీపై తన పోరాటం కొనసాగించలేనని పేర్కొన్న వినేశ్.. బాధాతప్త హృదయంతో రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికింది. 

కుస్తీ కుటుంబం నుంచి..

హర్యానాకు చెందిన దిగ్గజ రెజ్లర్ మహవీర్ ఫొగాట్ వారసురాలిగా వినేశ్ ఫొగాట్ కుస్తీలో అరంగేట్రం చేసింది. మహవీర్ సోదరుడు రాజ్‌పాల్ ఫొగాట్ కుమార్తె అయిన వినేశ్.. చిన్నప్పటి నుంచే పెద్దనాన్న సమక్షంలో కుస్తీ పోటీలకు సిద్ధమైంది. గీతా, బబితా మార్గాన్ని ఎంచుకున్న వినేశ్ కు ఆరంభంలో అవమానాలే ఎదురయ్యాయి. ఆడపిల్లలకు కుస్తీ పోటీలెందుకు అని ఊరివాళ్లు అవమానించారు. దీనిని పట్టించుకోని తండ్రి  రాజ్‌పాల్.. తన అన్న మహవీర్ బాటలోనే వినేశ్‌ను మల్ల యోధురాలుగా తీర్చిదిద్దాలనుకున్నాడు.

గీతా, బిబితాల్లాగే.. అనతి కాలంలోనే వినేశ్ మంచి రెజ్లర్‌గా పేరు తెచ్చుకుంది. 2013లో ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 51 కేజీల విభాగంలో కాంస్యం గెలవడం ద్వారా వినేశ్ పేరు వెలుగులోకి వచ్చింది. రెజ్లింగ్‌లో తన పట్టును చూపించిన వినేశ్.. పోరాటాల్లోనూ ముందు వరుసలో ఉంటుంది. రెండేళ్ల క్రితం మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా చేసిన పోరాటం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.

తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఫొగాట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌ను ఆశ్రయించింది. రజత పతకానికి అర్హురాలినని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. ఇంతలోనే తన వీడ్కోలు నిర్ణయా న్ని ప్రకటించింది. రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తన కు రజతం అందించాలని పెట్టుకున్న అభ్యర్థనను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ స్వీకరించింది. నేడు ఉదయం వినేశ్ పిటిషన్‌పై వాదనలు విననున్నట్లు కోర్టు తెలిపింది. ఆమె తరఫున లాయర్‌ను నియమించుకునేందుకు కూడా అవకాశం కల్పించింది.