న్యూయార్క్: టీమిండియా చేతిలో ఓటమి అనంతరం 48 గంటల వ్యవధిలోనే పాకిస్థాన్ మరో కీలకపోరుకు సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూయార్క్ వేదికగా పసికూన కెనడాతో నేడు పాకిస్థాన్ తలపడనుంది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన పాక్‌కు ఈ మ్యాచ్ చావో రేవో లాంటిది. కెనడాతో పోరులో గెలిస్తేనే పాకిస్థాన్ సూపర్ ఆశలు సజీవంగా ఉండనున్నాయి. ఒకవేళ ఏదైనా అద్బుతం జరిగి కెనడా గెలిస్తే పాక్ లీగ్ దశలోనే ఇంటిబాట పట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బాబర్ సేన ఎలా ఆడుతుందన్నది ఆసక్తికరం.
బౌలర్లకు విపరీతంగా సహకరిస్తున్న నసావు కౌంటీ పిచ్‌లోనే మ్యాచ్ జరుగుతుండడంతో పాక్ బౌలర్లు మరోసారి రాణించాలని ఉవ్విళ్లూరుతున్నారు. టీమిండియాతో మ్యాచ్‌లో పాక్ బౌలింగ్ ప్రదర్శన బాగానే ఉంది. షాహిన్, ఆమిర్, నసీమ్ షా, రవూఫ్‌లతో పేస్ విభాగం అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. ప్రమాదకరమైన పాక్ బౌలింగ్ లైనప్‌ను తట్టుకొని నిలబడడం కెనడాకు శక్తికి మించిన పనే. బ్యాటింగ్‌లో రిజ్వాన్ ఫామ్‌లోకి రాగా.. బాబర్ ఆజమ్, ఉస్మాన్ ఖాన్, ఆజం ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్, ఆల్‌రౌండర్ ఇమాద్ వసీమ్‌లు రాణించాల్సిన అవసరముంది. మరోవైపు ఐర్లాండ్‌పై విజయంతో కెనడా ఆత్మవిశ్వాసంతో పాక్‌తో పోరుకు రెడీ అయింది.
పాక్ సూపర్-8 చేరాలంటే..
A మొదట పాక్ ఆడబోయే చివరి ౨ మ్యాచ్‌ల్లో తప్పక నెగ్గాలి.
A టీమిండియా ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లోనూ (అమెరికా, కెనడాలపై) విజయం సాధించాలి.
A అమెరికా ఆడబోయే చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవాలి.
A పై మూడింటిలో ఏది జరగకపోయినా పాక్ లీగ్ దశలోనే ఇంటిబాట పట్టనుంది.