calender_icon.png 13 January, 2025 | 11:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లాభాల ఏడాదికి నష్టాలతో వీడ్కోలు

01-01-2025 12:00:00 AM

  1. 2024లో పెరిగిన ఇన్వెస్టర్ల సంపద రూ.77.66 లక్షల కోట్లు
  2. 8 శాతం ర్యాలీ జరిపిన స్టాక్ సూచీలు

ముంబై, డిసెంబర్ 31: ఏడాది మొత్తంమీద ఇన్వెస్టర్లకు మంచి లాభాల్ని అందిం చిన స్టాక్ మార్కెట్ 2024 సంవత్సరానికి స్వల్ప నష్టాలతో వీడ్కోలు పలికింది. 2024 చివరి రోజైన మంగళవారం అంతర్జాతీయ బలహీన సంకేతాల కారణంగా బీఎస్‌ఈ సెన్సెక్స్ 109 పాయింట్లు కోల్పోయి 78,139 పాయింట్ల వద్ద నిలిచింది.

ఇంట్రాడేలో ఇది 687 పాయింట్లు పతనమై 77,560 పాయింట్ల కనిష్టస్థాయిని తాకిన తర్వాత  చాలావరకూ నష్టాల్ని పూడ్చుకున్నది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రా డేలో 23,460 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయి నాటకీయంగా నష్టాల నుంచి దాదాపు కోలుకున్నది. చివరకు 0.10 పా యింట్ల నామమాత్రపు నష్టంతో 23,644. 80 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. 

 బలహీన గ్లోబల్ సంకేతాలు

అంతర్జాతీయ సంకేతాల బలహీనత కారణంగా రెండు రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్ ఒడిదుడకులకు లోనవుతున్నదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. సోమవా రం రాత్రి యూఎస్ స్టాక్ సూచీలు భారీ నష్టాల్ని చవిచూశాయి.

విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, పెరుగుతున్న క్రూడ్ ధరలు, రూపా యి క్షీణత స్థానికంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తున్నదని నాయర్ తెలి పారు. రానున్న రోజుల్లో మార్కెట్ ఫోకస్ క్యూ3 కార్పొరేట్ ఫలితాలు, కేంద్ర బడ్జెట్ వైపు మళ్లుతుందని, స్వల్పకాలంలో గ్లోబల్ అనిశ్చితులతో ఒడిదుడుకులకు లోనుకావచ్చని అంచనా వేశారు. 

ఐటీ షేర్లలో అమ్మకాలు

మంగళవారంనాటి ట్రేడింగ్ సెషన్‌లో ఐటీ షేర్లలో అమ్మకాలు జరిగాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్-30 ప్యాక్‌లో ప్రధాన ఐటీ షేర్లన్నీ నష్టపోయాయి. టెక్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్‌లు 2 శాతం వరకూ తగ్గాయి. వీటితో పాటు జొమాటో, ఐసీఐసీఐ బ్యాం క్, అన్నింటికంటే అధికంగా మహీం ద్రా అండ్ మహీంద్రా 2.5 శాతం పెరిగింది. 

ఇం డస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనీలీవర్‌లు 1 శాతం వరకూ తగ్గాయి. మరోవైపు కోటక్ మహీం ద్రా బ్యాంక్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెం ట్ టాటా మోటార్స్ స్వల్పంగా లాభపడ్డాయి. వివిధ రంగాల సూచీల్లో అధి కంగా ఐటీ ఇండెక్స్ 1.47 శాతం క్షీణించింది.

టెక్నాలజీ ఇండెక్స్ 1.02 శాతం,  రియల్టీ ఇండెక్స్ 0.36 శాతం, ఫైనాన్షియ ల్ సర్వీసెస్ ఇండెక్స్ 0.29 శాతం చొప్పన నష్టపోయాయి. క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 1.31 శాతం, ఇండస్ట్రియల్ ఇండెక్స్ 1.14 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 1 శాతం, మెటల్ ఇం డెక్స్ 0.85 శాతం చొప్పున   లాభపడ్డాయి. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.71 శాతం పెరిగింది.

ఏడాది మొత్తంలో సెన్సెక్స్ 5,898 పాయింట్లు జంప్

2024 ఏడాది మొత్తంమీద సెన్సెక్స్ 5,898 పాయింట్లు (8.16 శాతం), నిఫ్టీ 1,913 పాయింట్లు (8.80 శాతం) చొప్పున లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 2024 సెప్టెంబర్ 27న 85,978 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్ రికార్డు స్థాయిని నెలకొల్పింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా అదేరోజున 26,277 పాయింట్ల వద్ద రికార్డు గరిష్ఠస్థాయిని నమోదు చేసింది.

స్టాక్ మార్కెట్లో పెట్టుబడి చేసిన ఇన్వెస్టర్ల సంపద ఏడాది మొత్తంమీద రూ.77.66 లక్షల కోట్లు పెరిగింది. ఈ ఏడాది బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.77,66,260 కోట్లు పెరిగి రూ.4,41,95,106 కోట్లకు (5.16 ట్రిలియన్ డాలర్లు) చేరింది.

2004లో పలు సవాళ్లు ఎదురైనప్పటికీ, ఇన్వెస్టర్లకు లాభం చేకూరిందని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే చెప్పారు. నిఫ్టీ జనవరి నుంచి సెప్టెంబర్ వరకూ క్రమేపీ పెరిగి 26,277 పాయింట్ల వద్ద కొత్త రికార్డు సృష్టించిందని, చివరి త్రైమాసికంలో కొంత లాభాల్ని కోల్పోయినా ఏడాది మొత్తంలో మంచి రాబడుల్నే అందించిందన్నారు. నిఫ్టీ పెరగడం ఇది వరుసగా తొమ్మిదవ ఏడాది అని చెప్పారు. 

ఎఫ్‌పీఐల అమ్మకాలు రూ.4,645 కోట్లు 

ఈ ఏడాది చివరిరోజున మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) అమ్మకాలు పెంచారు. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ.4,645  కోట్ల విలువైన ఈక్విటీలను నికరంగా విక్రయించినట్లు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో వెనక్కు తీసుకున్న రూ.3,100 కోట్లకంటే ఈ ఒక్కరోజులో అధికంగా విక్రయించారు.