లండన్: రెండు దశాబ్దాలకు పైగా తన పేస్ ప్రత్యర్థులను భయపెట్టిన ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. జూలైలో వెస్టిండీస్‌తో తొలి టెస్టు అనంతరం ఆటకు వీడ్కోలు పలకనున్నట్లు అండర్సన్ శనివారం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించాడు. కెరీర్ ఆరంభించిన లార్డ్స్ మైదానంలోనే చివరి టెస్టు మ్యాచ్ ఆడనున్నట్లు పేర్కొన్నాడు. ఇన్నాళ్లు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. 20 ఏళ్లకు పైగా ప్రపంచ అత్యుత్తమ పేసర్‌గా మన్ననలందుకున్న 41 ఏళ్ల అండర్సన్.. ఇంగ్లండ్ తరఫున ఇప్పటి వరకు 187 టెస్టులాడి 700 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో మురళీధరన్ (800), వార్న్ (708) తర్వాత ఇదే అత్యధికం. పేసర్ల విభాగంలో అండర్సన్ అగ్రస్థానంలో ఉన్నాడు. 194 వన్డేల్లో 269 వికెట్లు తీసిన అండర్సన్ 19 టీ20ల్లో 18 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.