calender_icon.png 27 December, 2024 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధికి మంచి మార్గం

09-07-2024 12:05:00 AM

కుటుంబ బాధ్యతలతో వంటింటికే పరిమితమయ్యే మహిళలు ఇప్పుడిప్పుడే ఆర్థిక స్వావలంభన దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా సంఘాల ద్వారా పొదుపు చేసుకున్న సంఘా సభ్యులు వడ్డీ లేని రుణాలతో కొంతమేర ఆర్థిక బలోపేతం అయ్యారు. కానీ పూర్తిస్థాయిలో ఉపాధి మార్గాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ ఊరటనిచ్చింది. మహిళా సంఘాల సభ్యులకు కుట్టు మిషన్‌లో శిక్షణ ఇచ్చారు. అయితే గత ఏడాది నుంచి మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫాంలు కుట్టే బాధ్యతలు అప్పగించింది.        జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా నాలుగు మాసాలుగా మహిళా సంఘాల సభ్యులు విద్యార్థుల యూనీఫాంలు కుట్టే పనిలో నిమగ్నమయ్యారు. వాళ్ల గురించే ప్రత్యేక కథనం..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో డీఆర్‌డీవొ ద్వారా 11 మండలాలు, ఒక మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 29 మహిళా సంఘాలకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫాంలు కుట్టే బాధ్యతలు అప్పగించారు. 29మహిళా సంఘాల నుంచి 315మంది సభ్యులకు ఉపాధి అవకాశాలు లభించాయి. జిల్లాలో 420 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో బాలబాలికలు మొత్తం 20,710మంది ఉన్నారు. వీరికి ఏడాదికి రెండు జతల యూనీఫాంలను అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే 29మహిళా సంఘాలకు చెందిన 315మంది సభ్యులు ఈ దుస్తులు కుట్టే పనిలో నిమగ్నమయ్యారు. మొదటి విడతగా ఒక యూనిఫాం అందిం చగా రెండో దశ యూనిఫాం కుట్టే పనిలో మహిళలు నిమగ్నమయ్యారు. 

ఒక యూనిఫాంకు రూ.75 చెల్లింపు..

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్ధులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలతో పాటు స్కూల్ డ్రెస్‌ను సైతం అందిస్తోంది. గతంలో ఇతర సంస్థలకు యూనిఫాంలు కుట్టే బాధ్యతలు అప్పగించగా ఈసారి మహిళా సంఘాల సభ్యులకు ఆ బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ఈ క్రమంలో ఒక యూనిఫాం కుడితే ప్రభుత్వం రూ.75లు చెల్లిస్తుంది. ఒక సంఘ సభ్యురాలు రోజుకు కనీసం ఐదు నుంచి ఆరు యూనిఫాంను కుడుతున్నది. అయితే సభ్యులు ఒక టీంగా ఏర్పడి యూనిఫాంల టార్గెట్ పూర్తి చేస్తారు. దీంతో ఒక సభ్యురాలికి కూలీ గిట్టుబాటు అవుతుంది. 

ఆర్థిక చేయూత..

జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఆర్థిక చేయూతనందిస్తోంది. ఇప్పటికే వడ్డీలేని రుణాలతో ఆర్థిక బలోపేతానికి సహకారం అందించగా తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు అందించే ఉచిత యూనిఫాంలు కుట్టే బాధ్యతలు అప్పగించడంతో మహిళా సంఘాల సభ్యులకు ఆర్థిక చేయూతనందించినట్లు అయింది. మహిళా సంఘాల్లోని సభ్యులు ఉపాధి మార్గాలులేక అత్యధికంగా కూలీ పనులకే వెళ్తుంటారు. కానీ యూనిఫాంలు కుట్టే బాధ్యత అప్పగించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 డాకు నాయక్, జయశంకర్ భూపాలపల్లి

కుట్టు మిషన్‌పై శిక్షణ

మహిళా సంఘాల సభ్యుల్లో కుట్లు, అల్లికలపై ఆసక్తి ఉన్నవారికి కుట్టు మిషన్‌పై డీఆర్‌డీవొ ద్వారా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ఆయా మండల కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మూడు మాసాల పాటు వివిధ కుట్టుపై శిక్షణ ఇచ్చి వారికి ఉచితంగా కుట్టుమిషన్‌లు కూడా అందజేశారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంభన పొందుతున్నారు. 

 కూర రమల, 

శ్రీ వెంకటేశ్వర సంఘం అధ్యక్షురాలు

రోజుకు రూ.350..

డీఆర్‌డీవొ ద్వారా కుట్టుపై శిక్షణ ఇచ్చిన అధికారులు ఇప్పడు ఉపాధి మార్గం చూపా రు. ప్రతి రోజు ఒక్కరు ఐదు నుంచి ఆరు యూనిఫాంలు కుడుతున్నారు. ఒక్కొక్కరికి రోజుకు రూ.350 వరకు గిట్టుబాటు అవుతున్నది. ఇతర కూలీ పనుటకు వెళ్లకుండా అందరం కలిసి కుట్టుపని చేస్తున్నం. ఎండకు వెళ్ళకుండా ఉపాధి పనిదొరకడం సంతోషంగా ఉంది.

 ముక్కెర శంకరక్క