డబ్ల్యూటీఏ ఫైనల్స్
రియాద్: ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో అమెరికా స్టార్ కోకో గాఫ్ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో గాఫ్ 6-3, 6-2 తో తన దేశానికే చెందిన జెస్సికా పెగులాపై విజయం సాధించింది. గంటకు పైగా సాగిన మ్యాచ్‌లో గాఫ్ సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది. 2 ఏస్‌లు సంధించిన గాఫ్ ఎనిమిదిలో ఐదింటిని బ్రేక్ పాయింట్లుగా మలుచుకుంది.
గాఫ్ 35 విన్నర్లు కొట్టగా.. జెస్సికా 26 విన్నర్లకే పరిమితమైంది. మరో సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ ఇగా స్వియాటెక్ కూడా బోణీ కొట్టింది. స్వియాటెక్ 4-6, 7-5, 6-2తో 8వ సీడ్ బార్బరా క్రెజికోవాను ఓడించింది. రెండున్నర గంటల పాటు సాగిన పోరులో స్వియాటెక్ 10 ఏస్‌లతో పాటు 57 విన్నర్లు కొట్టింది. మరోవైపు మూడు ఏస్‌లకు పరిమితమైన క్రెజికోవా ఆరు డబుల్ ఫాల్ట్స్‌తో మూల్యం చెల్లించుకుంది.
మిగిలిన మ్యాచ్‌ల్లో నంబర్‌వన్ అరీనా సబలెంకా, జాస్మిన్ పవోలిని కూడా విజయాలు సాధించారు. టాప్-8 ఆటగాళ్ల మధ్య జరిగే డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో పర్పుల్ గ్రూప్‌లో సబలెంకా, పవోలిని, రిబాకినా, జెంగ్ ఉండగా.. ఆరెంజ్ గ్రూప్‌లో స్వియాటెక్, గాఫ్, క్రెజికోవా, పెగులా ఉన్నారు. నవంబర్ 9న టోర్నీ ఫైనల్ జరగనుంది.