calender_icon.png 10 January, 2025 | 1:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోణీ అదుర్స్

20-07-2024 01:32:22 AM

  • పాకిస్థాన్‌పై భారత్ ఘనవిజయం
  • మహిళల ఆసియా కప్

ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత మహిళల క్రికెట్ జట్టు.. ఆసియా కప్‌లో శుభారంభం చేసింది. దాయాది పాకిస్థాన్‌తో జరిగిన పోరులో హర్మన్‌ప్రీత్ బృందం ఘనవిజయం సాధించింది. బౌలింగ్‌లో దీప్తి, రేణుక, శ్రేయాంక అదరగొడితే.. బ్యాటింగ్‌లో ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ దంచికొట్టారు. 

దంబుల్లా: మహిళల ఆసియాకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఘనంగా బోణీ కొట్టింది. గ్రూప్ భాగంగా శుక్రవారం జరిగిన పోరులో టీమిండియా 7 వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుచేసింది. ఈ టోర్నీలో ఘనమైన రికార్డు ఉన్న భారత్.. ఈ సారి కూడా దాన్ని కొనసాగించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. సిద్ర అమిన్ (25) టాప్ స్కోరర్ కాగా.. తుబా హసన్ (22), ఫాతిమ సన (22 నాటౌట్) పర్వాలేదనిపించారు.

తక్కిన వాళ్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టగా.. రేణుక, శ్రేయాంక, పూజ తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 14.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (31 బంతుల్లో 45; 9 ఫోర్లు), షఫాలీ వర్మ (29 బంతుల్లో 40; 6 ఫోర్లు, ఒక సిక్సర్) ధాటిగా ఆడారు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 85 పరుగులు జోడించడంతో టీమిండియా విజయం లాంఛనమైంది. దీప్తి కి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. తదుపరి మ్యాచ్‌లో ఆదివారం యూఏఈతో భారత్ తలపడనుంది.