calender_icon.png 1 October, 2024 | 3:08 PM

యూఎస్ వెళ్లేవారికి శుభవార్త

01-10-2024 12:36:09 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: యూఎస్ వెళ్లాలనుకునే భారతీయులకు ఆ దేశ ప్రతినిధులు గుడ్‌న్యూస్ చెప్పారు. యూఎస్ వీసాల కోసం పర్యాటకులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, విద్యార్థుల నుంచి డిమాండ్ పెరగడాన్ని దృష్టిలో పెట్టుకొని.. భారతీయుల కోసం ఆ దేశం 2.5లక్షల అదనపు వీసా అపాయింట్‌మెంట్లను కేటాయించినట్లు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం(యూఎస్ ఎంబసీ) సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది.

తాజాగా విడుదల చేసిన స్లాట్లతో వేలాది మంది భారతీయ దరఖాస్తుదారులు సకాలంలో  ఇంటర్వ్యూలు పొందటంతో పాటు ఇరు దేశాల మధ్య బంధాలు మరింత ధృడమవుతాయని నిపుణులు చెబుతున్నారు. వరుసగా రెండో ఏడాది కూడా 10 లక్షలకు పైగా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసీ అపాయింట్‌మెంట్లను చేపట్టినట్లు యూఎస్ ఎంబసీ అధికారులు తెలిపారు.

విద్యార్థి వీసా సీజన్‌కు సంబంధించి ఈ వేసవిలో రికార్డుస్థాయిలో విద్యార్థులకు భారత్‌లోని 5 యూఎస్ ఎంబసీల్లో ఎక్కడో ఒక చోట అపాయింట్‌మెంట్ పొందే అవకాశం ఉందని తెలిపింది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో విద్యార్థి వీసాలు జారీ చేశామని.. ఈసారి ముఖ్యంగా అమెరికాలో ఉంటున్నవారి కుటుంబసభ్యులు, బిజినెస్, పర్యాటకు లపై దృష్టి సారించినట్లు తెలిపారు.

యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వీసా ప్రక్రియను మెరుగుపరచడంతో పాటు వేగవంతంగా చేపట్టాలని కోరిన నేపథ్యంలో.. ఇండియా నుంచి అమెరికాకు రావాలనుకుంటున్నవారి డిమాండ్‌ను తీర్చేందుకు అవిశ్రాం తంగా పనిచేస్తున్నాం అని అన్నారు.