అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి విజయం సాధించినప్పటినుంచి వలస విధానాలు, హెచ్1బీ వీసాలకు సంబంధించి భారతీయుల్లో అనేక అనుమానాలు, భయాలు నెలకొని ఉన్నాయి. అయి తే మరో రెండు రోజుల్లో గద్దె దిగనున్న జో బైడెన్ పరిపాలనలో వలస విధాన సంస్కరణల్లో ఒకటిగా భావించే హెచ్1బీ వీసా ప్రోగ్రామ్‌ను ఆధునీకరించే ప్రక్రియ శుక్రవారంనుంచి ప్రారంభం అవుతోంది.
దీనికి సంబంధించిన ప్రకటన గతంలోనే వెలువడినప్పటికీ ట్రంప్ విజయం తర్వాత ఇది అమలవుతుందా, వలసలను వ్యతిరేకించే ట్రంప్ మోకాలడ్డుతారా అన్న అనుమానాలున్నాయి. అయితే వీసా ప్రోగ్రామ్‌ను ఆధునీ కరించడమే కాకుండా సమర్థవంతమైన విదేశీ ఉద్యోగులకు మాత్రమే మరిన్ని అవకాశాలు అందించే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నట్లు సమాచారం. దీనివల్ల వేలాదిమంది భారతీయ టెక్ నిపుణులకు ప్రయోజనం చేకూరనుంది. ఎందుకంటే అమెరికా ప్రతి ఏటా జారీ చేసే హెచ్‌బీ వీసా లు పొందే వారిలో భారతీయులే ఎక్కువగా ఉంటున్నారు.
తాజాగా గత ఏడాది అమెరికా జారీ చేసిన హెచ్1బీ వీసాలకు సంబంధించిన లెక్కలను గమనిస్తే ఆ దేశం జారీ చేసిన ప్రతి ఐదు హెచ్1బీ వీసాల్లో ఒకటి భారతీయులకే దక్కాయి. గత ఏడాది ఏప్రిల్ సెప్టెంబర్ నెలల మధ్య కాలంలో అమెరికా మొత్తం జారీ చేసిన లక్షా 30వేల హెచ్‌బీ వీసాల్లో 24,766 వీసాలను ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా లాంటి భారతీయ కంపెనీలే దక్కించుకున్నాయి.
ఇవి కాకుండా ముందు వరసలో ఉన్న అమెజాన్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ లాంటి అమెరికా సంస్థలు దక్కించుకున్న వీసాల్లోను మనవాళ్లదే సింహభాగం. యునైటెడ్ స్టేట్స్ సిటిజ న్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్)హెచ్1బీ వీసాలకు సంబంధించి తుది నియమం ఆమోద ప్రక్రియను క్రమబద్ధీకరించడం ద్వారా ప్రతిభావంతులైన ఉద్యోగులను నిలుపుకోవడానికి యజమానులను అనుమతించేందుకు ఈ ప్రోగ్రామ్‌ను ఆధునీకరిస్తున్నట్లు డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
దీనివల్ల హెచ్1బీ వీసా ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను ‘స్పెషల్ ఆకుపేషన్’ కింద కంపెనీలు నియమించుకోవడం ఇక సులభతరం అవుతుంది. కంపెనీలు తమ నిర్దిష్ట శ్రామిక శక్తి అవసరాల ఆధారంగా హెచ్1బీ కార్మికులను నియమించుకోవచ్చు. అలాగే ఎఫ్1 విద్యార్థి వీసాలనుంచి హెచ్1బీ వీసా లకు మారడం కూడా సులువవుతుంది.
దీనివల్ల ఈ వీసాలతో అమెరికాలో ఉండే వేలాదిమంది భారతీయ విద్యార్థులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. అన్నిటికన్నా మించి వీసా గడువు ముగిసే సమయంలో దాన్ని రెన్యువల్ చేసుకోవడానికి స్వదేశానికి రావలసిన అవసరం లేకుం డా అక్కడినుంచే చేసుకోవచ్చు. కొత్త రూల్ ప్రకారం హెచ్1బీ వీసా కో సం దరఖాస్తు చేసుకునే వారు ఫారం 1119ను తప్పనిసరిగా సమర్పించాలి.
వీసా సంస్కరణలను ట్రంప్ టీమ్‌లోని టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి వంటి వారు బలంగా సమర్థిస్తూ ఉంటే అధికార రిపబ్లికన్ పార్టీలోనే దీనిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మంచి వేతనాలు అందుకునే అమెరికన్ ఉద్యోగులను తొలగించడం కోసమే ఈ మార్పులన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ మార్పులు అమెరికా ఉద్యోగులకు నష్టమని, వారి స్థానంలో తక్కువ వేతనాలకే వచ్చే విదేశీయులను కంపెనీలు నియమించుకుంటున్నాయని సెనే టర్ బెర్నీ శాండర్స్ ఆరోపిస్తున్నారు. దీన్ని అరికట్టడానికి వీసా ఫీజులను భారీగా పెంచుతూ చట్టంలో మార్పులు చేయాలని ఆయన అంటున్నారు. అన్నిటికన్నా మించి రెండు రోజుల్లో అధికారం చేపట్టబోయే ట్రంప్ ఈ మార్పులను ఎంతవరకు అంగీకరిస్తారు? ఆయన మళ్లీ ఎలాంటి సంస్కరణలు తీసుకు రానున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.