calender_icon.png 29 December, 2024 | 6:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌ఆర్‌ఆర్‌కు గుడ్‌న్యూస్ ఉత్తరభాగానికి టెండర్లు

29-12-2024 02:33:19 AM

161.5 కి.మీ మేర పనులకు రూ. 7,104.06 కోట్లతో.. 

హైదరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణంపై కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ టెండర్లను జారీచేసింది. సుమారు 161.5 కిలోమీటర్లుల మేర ఉత్తరభాగం ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి టెండర్లను పిలుస్తూ శనివారం నిర్ణయం తీసుకుంది.

4 లైన్ల ఎక్స్‌ప్రెస్ రహదారిగా ఈ రోడ్డును నిర్మించనున్నట్లు టెండర్ నోటీసులు స్పష్టంచేసింది. రూ. 7,104.06 కోట్లకు టెండర్లు పిలిచిన కేంద్రం.. అందుకు అవసరమైన నిధులను విడుదలచేస్తూ ఆదేశాలు జారీచేసింది. రెండేళ్లలో ఈ రోడ్డు పనులు పూర్తిచేయాలని నిబంధన విధించింది. ఉత్తరభాగం పనులను 5 ప్యాకేజీలుగా చేపడుతున్నట్లు వెల్లడించింది.

మొదటి ప్యాకేజీని సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి రెడ్డిపల్లి వరకు, రెండో ప్యాకేజీని రెడ్డిపల్లి నుంచి ఇస్లాంపూర్ వరకు, మూడో ప్యాకేజీని ఇస్లాంపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు, నాలుగో ప్యాకేజీని ప్రజ్ఞాపూర్ నుంచి రాయగిరి వరకు, ఐదో ప్యాకేజీని రాయగిరి నుంచి తంగెడుపల్లి వరకు చేపడుతున్నట్లు వెల్లడించింది.

ఈ పనులను సాధ్యమైనంత త్వరగా చేపట్టి అందుబాటు లోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటినుంచో ఎదురుచూస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్‌ఆర్‌ఆర్ అంశంపై ముఖ్యమంత్రి, సహా మంత్రులు పలుమార్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు.

ఆర్‌ఆర్‌ఆర్ నిర్మా ణం ఆవశ్యకతను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తులకు స్పందించిన కేంద్రం శనివారం టెండర్లను పిలుస్తూ నిర్ణయం తీసుకుంది. 

ప్యాకేజీల వివరాలు

ప్యాకేజీ-1: సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి రెడ్డిపల్లి వరకు 34.5 కి.మీ

ప్యాకేజీ-2: రెడ్డిపల్లి నుంచి ఇస్లాంపూర్ వరకు 26 కి.మీ

ప్యాకేజీ-3: ఇస్లాంపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు 23 కి.మీ 

ప్యాకేజీ-4: ప్రజ్ఞాపూర్ నుంచి యాదాద్రి జిల్లా రాయగిరి వరకు 43 కి.మీ 

ప్యాకేజీ-5: రాయగిరి నుంచి తంగెడుపల్లి వరకు 35 కి.మీ

మొత్తం పొడవు- 161.5 కి.మీ