29-03-2025 01:40:15 AM
జనవరి 1 నుంచి వర్తింపు
ఈ పెంపుతో 55 శాతానికి డీఏ
చివరగా గతేడాది జూలైలో పెంపు
పీఎల్‌ఐ పరిధిలోకి నాన్ ఎలక్ట్రానిక్స్ విడిభాగాల పరిశ్రమ
న్యూఢిల్లీ, మార్చి 28: ఉగాది పండుగకు ముందే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను (డియర్‌నెస్ అలవెన్స్) 2 శాతం పెంచుతూ శుక్రవారం క్యాబినెట్ నిర్ణ యం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఉద్యోగుల డీఏ 55 శాతానికి చేరుకుంది. చివరగా 2024 జూలైలో కేంద్రం ఉద్యోగుల డీఏను పెంచింది.
కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. ‘పెంచిన డీఏ జనవరి 1 నుంచి వర్తించనుంది. డీఏ పెంపుతో 48.66 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 66.55 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. నాన్ కండక్టర్ ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీని పీఎల్‌ఐ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం) కిందకు తీసుకొస్తూ ఆరేళ్ల కోసం రూ. 22,919 కోట్లు కేటాయించింది. ఖరీఫ్ సీజన్‌లో (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్) పొటాష్, పాస్పేట్ పర్టిలైజర్ల సబ్సిడీ కోసం రూ. 37,216 కోట్లు కేటాయించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది’ అని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.
దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకే..
దేశీయంగా ఉత్పత్తిని పెంచడం కోసం ప్రభుత్వం పీఎల్‌ఐ (ప్రొడక్షన్ లింక్డ్ ఇంటెన్సివ్) పథకం తీసుకొచ్చింది. దేశీయ ఉత్పత్తిదారులను బలోపేతం చేసి దేశంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను పెంచడమే దీని లక్ష్యం. దేశంలోని నాన్ సెమీకండక్టర్ పరిశ్రమకు పీఎల్‌ఐ పథకం అమలుచేయాలని చాలా రోజుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్యాబినెట్ పీఎల్‌ఐని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది.