calender_icon.png 6 February, 2025 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలిఏడాది మంచి మార్కులే!

08-12-2024 12:00:00 AM

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాదిని పూర్తి చేసుకుంది. ఏడాదిక్రితం డిసెంబర్ 7న అధికారం చేపట్టిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గత ఏడాది కాలంలో అటు రాజకీయంగా, ఇటు పాలనా పరంగా అన్నిరకాల పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొందనే చెప్పాలి. ఏ ప్రభుత్వానికయినా ఏడాది సమయం తక్కువే. అప్పుల భారంతో పాటు ఖజానా ఖాళీ అవడంతో ఎన్నికల హామీలతో పాటుగా ప్రభుత్వ పథకాల అమలు సర్కార్‌కు కత్తిమీద సాముగానే మారింది.

అయినప్పటికీ ఈ రెండు విషయాల్లోను రేవంత్ సర్కార్ ప్రజల దృష్టిలో సంతృప్తికరమైన మార్కులే సంపాదించిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అధికారం చేపట్టిన రోజునుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వంటగ్యాస్ సబ్సిడీ పథకం, సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ వంటి హామీలను అమలు చేయడం మొదలు పెట్టింది. వీటన్నిటికీ మించి సర్కార్ సాధించిన రెండు  ముఖ్య విజయాలున్నాయి.

అందులో మొదటిది నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చినట్లుగా ఏడాదిలోనే 51 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కాగా, రూ.2 లక్షల లోపు రైతురుణాల మాఫీ రెండవది. మొదట్లో రుణమాఫీ అమలులో కొన్ని ఇబ్బందులు ఎదురయినప్పటికీ ప్రభుత్వ పెద్దల జోక్యంతో సజావుగానే సాగిపోయింది. ఇది కళ్ల ముందు కనిపిస్తోంది. అలాగే మరో ముఖ్య హామీ రైతు భరోసాను కూడా సంక్రాంతి నాటికల్లా రైతుల ఖాతాల్లో వేస్తామని సీఎం ఇటీవల ప్రకటించడంతో ఆగిపోతుందేమోనని భయపడిన రైతాంగంలో ఆనందం కనిపిస్తోంది.

కేసీఆర్ హయాంలో రైతుబంధు పేరుతో అమలయిన ఈ పథకంలో కొంత దుర్వినియోగం జరిగిన నేపథ్యంలో తాజాగా విధి విధానాల రూపకల్పన కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు హామీల్లో ఇప్పటివరకు ఒక్క ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏదీ అమలు కాలేదంటూ ప్రధాన ప్రతిపక్షాలయిన బీఆర్‌ఎస్, బీజేపీలు రోడ్డెక్కి మరీ ఆందోళనలు చేస్తున్నాయి. కానీ ప్రభుత్వవాదన వేరుగా ఉంది. ఏడాది ప్రజా పాలనలో ఆరు గ్యారంటీలే కాదు 160 పథకాలు, కార్యక్రమాలను అమలు చేశామని, ప్రస్తుత పథకాలను కొనసాగిస్తూనే రేవంత్ రెడ్డి సర్కార్ వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టిందనేది ప్రభుత్వపెద్దల వాదన.

అయితే పట్టణ ప్రాంత పర్యావరణ పరిరక్షణతో పాటుగా చెరువులు, నాలాల ఆక్రమణలను తొలగించడానికి ఏర్పాటు చేసిన హైడ్రా, మూసీ సుందరీకరణ ప్రాజెక్టులకు మొదట్లో ప్రజలనుంచి పూర్తి మద్దతు లభించినా పేద, మధ్యతరగతి వర్గాల ఇళ్ల కూల్చివేత మొదలు కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పథకాలపై ప్రజల్లో ముందుగా అవగాహన కల్పించకపోవడంతో ప్రభుత్వం కాస్త వ్యతిరేకతను మూటగట్టుకోవలసి వచ్చింది.

లగచర్ల ఘటన విషయంలోనూ ఇదే జరిగింది. పాలనా అనుభవం లేకపోవడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. రేవంత్ సర్కార్ విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం మరో మంచి నిర్ణయం,  యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ప్రతి నియోజకవర్గంలో సమీకృత రెసిడెన్షియల్ పాఠశాల, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనతో పాటుగా పోటీపరీక్షలను నిర్వహించడం హర్షదాయకం.

పాత ప్రభుత్వానికి భిన్నంగా సెక్రటేరియట్‌లో సమీక్షలు జరపడం, ప్రజాదర్బార్‌ల నిర్వహణ వంటి వాటిపైనా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.అయితే ఏడాది కాలమయినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరక్కపోవడంలాంటివి రాజకీయంగా విమర్శలకు తావిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాలే ఆయుధాలుగా చేసుకుని ప్రతిపక్షాలు ప్రజాక్షేత్రంలో పెద్దఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. అయితే ఇప్పటివరకు రాజకీయంగా ప్రతిపక్షాలపై రేవంత్‌రెడ్డిదే పైచేయి అనే చెప్పాలి. మొత్తంమీద ఏడాది పాలనను సంతృప్తికరంగా పూర్తి చేసుకున్న రేవంత్ సర్కార్ కొత్త ఏడాది మరింత దృఢసంకల్పంతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది.