- గత ఏడాది అక్టోబర్ నుంచి అందని వైనం
- గర్భిణులు, బాలింతలకు తప్పని ఎదురుచూపులు
వనపర్తి, అక్టోబర్ 22 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం చేపట్టిన ఎంసీ హెచ్ కిట్‌తో పాటు గర్భిణులు, బాలింతలకు ప్రోత్సాహకాలు, గర్భిణులకు అందజేసే న్యూట్రిషన్ కిట్‌లకు కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పలికింది.
గత ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేసింది. కిట్‌లో 20 రకాల వస్తువులను తల్లికి బిడ్డకు అవసరమైన వాటిని ఉంచి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే సమయంలోనే అందజేసేది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ కిట్ పేరును ఎంసీహెచ్ కిట్‌గా మార్చింది.
పేరు మార్చిన తర్వాత అప్పటికే ఉన్న కేసీఆర్ కిట్లపై ఎంసీహెచ్ కిట్లుగా స్టిక్కర్లను అతికించి బాలింతలకు అందజేశారు. వనపర్తి జిల్లా వ్యాప్తంగా సుమారు వెయ్యికి పైగా బాలింతలకు ఎంసీహెచ్ కిట్లు అందజేయాల్సి ఉంది. ఆసుపత్రుల్లో కిట్ల గురించి అడిగే బాలింతలకు సమాధానం చెప్పలేక వైద్యులు నానా ఇబ్బందులను పడుతున్నారు.
గర్భిణులకు పౌష్ఠికాహారం ఏది?
గర్భిణులకు పౌష్ఠికాహారాన్ని అందించ డం ద్వారా రక్తహీనతకు గురవకుండా మాతా శిశు మరణాలను తగ్గించేలా గత ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేసే ది. న్యూట్రిషన్ కిట్‌లో నెయ్యి, హార్లిక్స్, ఖర్జూరాలు, పల్లీ పట్టి వస్తువులను ఉంచి అందజేసేవారు. ప్రస్తుతం ఆ కిట్ల పంపిణీ కూడా నిలిచిపోయింది. కాగా ప్రభుత్వం నుంచి ఎంసీహెచ్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు సరఫరా కావాల్సి ఉన్నదని, వచ్చిన వెంటనే అందజేస్తామని డీఎంహెచ్‌వో చంద్రమోహన్ తెలిపారు.