31-03-2025 01:29:10 AM
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు.
సిద్దిపేట, మార్చి 30 (విజయక్రాంతి): విశ్వవసు నామ సంవత్సరం మన రాష్ట్ర ప్రజలకు, సిద్దిపేట ప్రజలకు శుభం కలగాలని ఆ భగవంతుడిని మనస్పూర్తిగా ప్రార్థి స్తున్నాట్లు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు.
పాత రోజుల్లో పంచాంగ శ్రవణానికి చాలా ప్రాధాన్యత ఉండేదాని, రాను రాను పత్రికలతో పాటు పంచాంగం డిజిటల్ మీడియాలో కూడా వచ్చేస్తుందని, మన రాశిఫలాల ఆధారంగా చదువుకోవడం అలవాటయింద న్నారు. ఇప్పుడు ఫోన్లోనే చూసుకోవడం బాగా అలవాటై పంచాంగ శ్రవణానికి కొంచెం ప్రాధాన్యత తగ్గిందాని, ఆచార సాంప్రదాయాలు కొనసాగాలి. దీనిని ముందుతరాలకు అందించే బాధ్యత మనందరిపై ఉందన్నారు.
దేశంలో మొట్టమొదటిసారి బ్రాహ్మణ పరిషత్ ను సిద్దిపేటలో ఏర్పాటు చేశారాని, ముఖ్యమంత్రిగా దేశంలోనే మొట్టమొదటిసారి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత కేసిఆర్ కు దక్కిందన్నారు. ఆలయాల్లోని హుండీలో డబ్బులు వస్తేనే పూజారులకు జీతం వచ్చే పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితి నుండి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి ప్రతినెల మొదటి తేదీ దేవాలయ ఉద్యోగులకు జీతాలు వచ్చేలా చేశారని గుర్తు చేశారు.
యాదాద్రి దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని, ఈసారి అధికారంలోకి వచ్చుంటే కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేసేవారని చెప్పారు. పాత రోజుల్లో ఇంట్లో తిని సద్ది కట్టుకుని బయటకు వెళ్లేవారని, ఇప్పుడు బయట తిని కావలిస్తే డబ్బా కట్టుకుని ఇంటికి వచ్చే పరిస్థితి వచ్చిందన్నారు.
ఒక గుణాత్మక మార్పు తేవాలంటే అది కేవలం ఆధ్యాత్మికత వల్లే సాధ్యమవుతుందని, సమాజాన్ని అటువైపుగా మనం నడిపించగలిగితే అందరూ సుభిక్షంగా, సంతోషంగా ఉంటారన్నారు. నేటితరం పిల్లలు అభివృద్ధితో పోటీపడుతూ తెలుగు భాషను మర్చిపోతున్నారని, విదేశాల్లో ఉండే పిల్లలకు సాంప్రదాయం, ఆచారాలను, పండుగలను చక్కగా నేర్పిస్తున్నారని తెలిపారు. విదేశాల్లో ఉండే మన తెలుగువారు బతుకమ్మ ఆడుతు, బోనాలు తీస్తున్నారని, వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తున్నారని, మన సంప్రదాయాన్ని మన పండుగలను చక్కగా జరుపుకుంటున్నా గొప్ప సంస్కృతి మన రాష్ట్రానికి ఉందని చెప్పారు.
సిద్దిపేటలో టీటీడీ ఆధ్వర్యంలో మరో వెంకటేశ్వర స్వామి ఆలయం శంకుస్థాపన చేయబోతున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సిద్దిపేట బ్రాహ్మణ పరిషత్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ శర్మ, మాజీ ఎమ్మెల్సీ పారుకు హుస్సేన్, బ్రాహ్మణ పరిషత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.