- భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరణ.. రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం
- ఫార్మా విలేజ్‌ల స్థానంలో ఇండస్ట్రియల్ పార్కు
- భూసేకరణ ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించిన టీజీఐఐసీ
- త్వరలో కొత్త నోటిఫికేషన్ ఇవ్వనున్న సర్కారు
హైదరాబాద్/వికారాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా దుద్యాలం మండంలోని లగచర్ల, పోలేపల్లి, హకీంపేట గ్రామాల్లో ఫార్మా విలేజ్‌లు ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ కోసం జారీచేసిన ఉత్తర్వులను ప్రభుత్వం శుక్రవారం ఉపసంహరించకున్నది.
ఫార్మా విలేజ్‌ల స్థానంలో ఇండ స్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. లగచర్ల, పోలేపల్లి, హకీంపేట గ్రామాల్లో భూసేకరణ కోసం ప్రభుత్వం ఆగస్టు 1న నోటిఫికేషన్‌ను జారీచేసింది. ప్రజలు, రైతుల ఆందోళన నేపథ్యంలో సర్కారు నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఒక్క లగచర్లలోనే 632 ఎకరాలను సేకరించాలని నిర్ణయించింది.
ఫార్మా పరిశ్రమల ఏర్పాటును లగచర్ల రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కలెక్టర్‌తో పాటు అధికారులు గ్రామసభను నిర్వ హించగా.. ఆ సభ రణరంగంగా మారింది. ఏకంగా కలెక్టర్‌పై దాడి జరిగింది. అధికారులపై కొందరు కర్రలు, రాళ్లతో దాడులు చేశా రు.
లగచర్ల సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ఉండటంతో ఈ ఘటన సంచలనంగా మారింది. దేశవ్యాప్తం గా చర్చకు దారితీసింది. ఫార్మా పరిశ్రమల ఏర్పాటును ప్రజలు వ్యతిరేకిస్తున్న నేపథ్యం లో ఇప్పుడు అదే ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఉద్యోగాలు..
పార్మా కంపెనీలకు తప్పితే.. వేరే పరిశ్రమలకు తమ భూములు ఇచ్చే ఆలోచలలో లగ చర్ల రైతులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని వల్ల స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయి. ఇండస్ట్రియల్ పార్కు పేరుతో భూ సేకరణకు కొత్త నోటిఫికేషన్‌ను ప్రభుత్వం త్వరలో ఇవ్వనుంది.
ప్రభుత్వానికి మరింత చెడ్డపేరు రావద్దనే..
సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ లో ఫార్మాసిటీ భూ సేకరణ అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. లగచర్ల ఘటనతో అధికార, ప్రతిప క్ష్యాల మద్య మాటల యుద్ధం జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా అధికారులపై దాడి, ఆ తరువాత అర్థరాత్రి గ్రామ స్తులను పోలీసులు అరెస్టు చేసిన తీరు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది.
ఇదే అవకా శంగా ప్రతిపక్షాలు బాధితులను ఢిల్లీకి తీసుకెళ్లి జాతీయ మానవ హక్కుల సంఘాన్ని, ఎస్సీ, ఎస్టీ కమిషన్లను ఆశ్రయించడం, లగచర్ల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హక్కుల కమిషన్లు వివరణ కోరడం వంటి అంశాలు సీఎం రేవంత్‌తో పాటు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి.
లగచర్ల సంఘ టనతో పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందనే ప్రచారం సొంత పార్టీలో జరిగింది. ఈ నేపథ్యంలోనే లగచర్ల ఘటనతో పార్టీకి, ప్రభుత్వానికి మరింత చెడ్డపేరు రావద్దనే ఉద్దేశంతోనే ఫార్మాసిటీ భూ సేకరణను నిలిపి వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గెజిట్ విడుదల..
లగచర్ల ఫార్మాసిటీ భూ సేకరణను నిలిపి వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం శుక్రవారం భూ సేకరణ చట్టం 2013 లోని సెక్షన్ 93 అనుగుణంగా ఉపసంహరణ గెజి ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దుద్యా ల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మాసిటీ ఏర్పాటుకు 01-08-2024 నాడు నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలిపారు. అట్టి నోటిఫికే షన్‌ను ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొన్నారు.
28 మంది రైతులు జైలులో..
నవంబర్ 11న లగచర్లలో జిల్లా కలెక్టర్, అధికారులపై దాడి ఘటనలో 40 మందికి పైగా అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో ఇప్పటివరకు 28 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, వీరంతా సంగారెడ్డి సబ్ జైలులో ఉన్నా రు. సంచలనంగా మారిన ఈ కేసులో కొండగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఏ చేర్చారు. ఈయన కూడా ప్రస్తుతం జైలులోనే ఉన్నారు.
లగచర్ల సంఘటన అనంతరం ప్రతిపక్ష పార్టీలైన బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఎం వంటి పార్టీలు నేరుగా ప్రభుత్వంపై విరుచుకపడటంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. కొన్ని రోజులుగా అన్నివర్గాల నుంచి లగచర్ల బాధితులకు మద్దతు పెరగడంతో ప్రభుత్వం వెనుకడుగు వేసిందనే ప్రచారం జరుగుతోంది. దాడి ఘటనతో జైలుకు వెళ్లి నా తమ భూమిని కాపాడుకున్నామనే సంతోషంలో బాధిత కుటుంబీకులు ఉన్నారు.
భూసేకరణ అధికారిగా సబ్ కలెక్టర్
ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు సంబంధించిన భూసేకరణ ప్రతిపాదనలను టీజీ ఐసీసీ ఇప్పటికే ప్రభుత్వానికి పంపింది. ఈ ఇండస్ట్రీయల్ పార్కులో కాలుష్య రహిత పలు కంపెనీలను ప్రభుత్వం ఏర్పటు చేయబోతోంది. అందులో టెక్‌స్టుల్ కంపెనీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భూసేకణ బాధ్యతను తాండూర్ సబ్ కలెక్టర్‌కు వికారాబాద్ కలెక్టర్ ఇప్పగించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ చేపట్టాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదే శించారు. దీంతో త్వరలోనే ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు కోసం భూసేకరణ ప్రక్రియ మొదలు కానుంది.
కమ్యూనిస్టుల కృషి: తమ్మినేని
ఫార్మా విలేజ్‌లకు సంబంధించిన భూసేకరణ ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేయ డంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హర్షం వ్యక్తం చేశారు. 580 రైతులకు సంబంధించిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ రద్దు కావడానికి కమ్యూనిస్టుల కృషే కారణమని చెప్పారు.
ఇది లగచర్ల ప్రజలు సాధించిన విజయమన్నారు. ఇదే సమయంలో అమాయక రైతులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని తమ్మినేని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ భూముల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసే ఆలోచనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు.
1,358 ఎకరాల్లో ఫార్మాసిటీ..
భూమిని కాపాడుకోవడం లగచర్ల భూ బాధితులకు జీవన్మరణ సమస్యగా మారింది. మూడు నెలల క్రితం ఫార్మాసిటీ ప్రతిపాదన వచ్చిన నాటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండల పరిధిలోని లగచర్ల, పోలెపల్లి, హకీంపేట్, రోటి బండ తండా, పులిచర్లగుట్ట తండాల పరిధిలో ఫార్మాసిటీ ఏర్పాటును ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఈ ఐదు గ్రామాలకు చెందిన 1,358 ఎకరాల భూమిలో ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో 547 ఎకరాలు అసైన్డ్ భూమి, 90 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండగా 721 ఎకరాలు పట్టా భూమి ఉంది. మొత్తం 800 మంది రైతులు ఫార్మాసిటీ కోసం తమ భూములు కోల్పోతున్నారు.
ఒక్కో రైతు సగటున ఎకరంన్నర భూమి కోల్పోతుండగా బాధిత రైతుల్లో ఎక్కువ శాతం సన్న చిన్న కారు రైతులే. అందులో అత్యధికంగా గిరిజనులే ఉన్నారు. వీరికి ఈ భూములు తప్ప వేరే జీవనోపాధి లేదు. దీంతో ఆ ఐదు గ్రామాల ప్రజలకు భూములు కాపాడుకోవడం జీవన్మరణ సమస్యగా మారింది. ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో ఆ ఐదు గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.