దేవుళ్ల పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా? ఇది ఓ చిత్రంలోని పాట.. కలలో మాత్రమే సాధ్యమయ్యే ఇలాంటి పెళ్లి వేడుక నిజజీవితంలోనూ సాధ్యమనేలా అపర కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. జౌరా అనిపించే ఏర్పాట్లు, పుష్కక విమానాలు, పారిజాతాలు, పంచభక్ష పరమాన్నాలు, సువర్ణ తోరణాలు, వెండి ద్వారాలు, వజ్రవైఢూర్యాలు, కళ్లు చెదిరే పీతాంబరాలు, కనువిందు చేసే తారల నృత్యాలు, అబ్బురపరిచే ఆతిథ్యాల మధ్య తరాలు మాట్లాడుకునేలా.. ప్రపంచమే అబ్బురపడేలా నవ జంట అనంత్ అంబానీ మర్చంట్‌లు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
దేశ, వీదేశీ ప్రముఖులు హాజరైన ఈ వివాహం వేడుకల్లో ప్రతి విషయం అందర్నీ ఆకట్టుకుంటోంది. ముంబైలోని ముకేశ్ అం బానీకే చెందిన జామ్‌నగర్‌లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా వేలాది మంది వీఐపీలు, సెలబ్రిటీలు, వివిధ రం గాల ప్రముఖులు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ శుక్రవారం ఇరు జంటలు ఒక్కటయ్యాయి. ఆద్యంతం హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లి వేడుకలో పెళ్లి పత్రిక నుంచి వంటల వరకు ప్రతిదీ ప్రత్యేకమే. డిజైనర్ దంపతులు అబూ జా నీ ఖోస్లా తయారు చేసిన డిజైన్ దుస్తులను ముకేశ్ అంబానీ ఫ్యామిలీ మెం బర్స్ ధరించారు.
ఘనంగా శుభ ఆశీర్వాద్ వేడుక
వివాహ వేడుక జూలై 12న శుభ వివాహంతో ప్రారంభమై నేటితో ముగియనుం ది. శనివారం శుభ ఆశీర్వాద్ ఘనంగా నిర్వహిం చారు. నేడు మంగళ్ ఉత్సవ్ జర గనుంది. శనివారం జరిగిన శుభ ఆశీర్వాద్ వేడుకకు సాంప్రదాయ వస్త్రాధరణలో వధూవరులు మెరిసిపోయారు. దాదాపుగా 2500 మంది ముఖ్య అతిథులు హాజరయ్యారు. వీరిని తీసుకొచ్చేందుకు ముకేశ్ అంబానీ మూడు ఫాల్కన్ జెట్స్ అద్దెకు తీసుకున్నారు.
స్పెషల్ అట్రాక్షన్‌గా నీతా అంబానీ నెక్లేస్
అనంత్ అంబానీ మర్చంట్‌ల ప్రీవెడ్డింగ్ వేడుకల్లో నీతా అంబానీ ధరించిన నెక్లేస్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. కాంచీపురం చీరతో మెడలో పొడవాటి ఆకుపచ్చ రంగు డైమండ్ నెక్లెస్‌తో కనిపించారు. తన ఐకానిక్ సిగ్నేచర్ మేకప్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ నెక్లెస్ ధర ఏకంగా రూ. 400 కోట్ల నుంచి రూ. 500 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఆమె ధరించిన చీరను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. చీరకు తగ్గట్టుగా డైమండ్ నెక్లెస్, వాటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, రింగ్ ధరించారు.
పెళ్లి వేడుకలో ప్రముఖుల డ్యాన్స్
అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో ప్రముఖ తారలు చేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ డ్యాన్స్ వేసిన వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. సినిమాల్లో తనదైన స్టుల్, డైలాగ్ డెలివరీతో అదరగొట్టే రజినీకాంత్ వధువు అనంత్ అంబానీతో కలిసి స్టెప్పులేషారు. ఏకంగా బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేశారు. రజినీతో పాటు బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబా వేసిన స్టెప్స్ నెటిజన్లు ఆకట్టుకుంటున్నాయి.
ఈ హారం ఖరీదు ఓ దేశ జీడీపీ
అనంత్ అంబానీ పెండ్లిలో ఆయన సోదరి ఇషా అంబానీ అత్యంత ఖరీదైన లెహంగా, భారీ పింక్ డైమండ్ నెక్లేస్ ధరించి కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె వేసుకున్న నెక్లేస్ అందరి దృష్టిని ఆకర్షించింది. దీని ధర దాదాపు ఓ చిన్న దేశ జీడీపీకి సమానమని వార్తలు వస్తున్నాయి. ఈ హారాన్ని కాంతిలాల్ చోటాలాల్ డిజైన్ చేశారు. దీనిపేరు గార్డెన్ ఆఫ్ లవ్ అని తెలిపారు.
134 రోజుల పాటు జరిగిన వేడుకలు
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుకలకు దేశవిదేశాలకు చెందిన వ్యాపారవాణిజ్య వేత్తలు, సినీ, క్రీడారంగాల ప్రముఖులు హాజరయ్యారు. వీరిద్దరికీ గతేడాది డిసెంబర్ 29న ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఇక, జామ్ నగర్ నుంచి జెనోవా (ఇటలీ) వరకు 134 రోజుల పాటు కొనసాగిన ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం అంబానీ కుటుంబం ఏకంగా రూ. 1200 కోట్ల వరకు ఖర్చు పెట్టిందని అంచనా. కేవలం వంటల కోసమే రూ. 210 కోట్లు ఖర్చు చేసినట్లు పలు కథనాలు వెల్లడించాయి.
ఆకట్టుకుంటున్న రాధిక వెడ్డింగ్ రింగ్
రాధిక మర్చంట్, అనంత్ అంబానీల వివాహ వేడుకలో పెళ్లి కార్డు నుంచి భోజనాల వరకు ప్రతి ఒక్కటీ ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా వధువు రాధికా మర్చంట్ ధరించిన డ్రెస్సులు, ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రముక స్టులిస్ట్ రియా కపూర్ రాధికా మర్చంట్ ధరించిన రింగ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ రింగ్‌లో A, R అక్షరాలు ఉన్నాయి. ఈ రెండు అక్షరాల మధ్య లవ్ సింబల్ ఆకట్టుకుంటోంది. అనంత్, రాధిక పేర్లలోని మొదటి అక్షరాలను ఈ డైమండ్ రింగ్‌లో చేర్చారు.
నీతా అంబానీ చేతిలో దీపం
కుటుంబంతో కలిసి పెళ్లి వేదిక వద్దకు వస్తున్నప్పుడు ముకేశ్ సతీమణి నీతా అంబానీ చేతిలో కనిపించిన సంప్రదాయ చిహ్నం అందరినీ ఆకర్షించింది. అది రామన్ దివో (ల్యాంప్). దానిపై గణేశుడి ప్రతిమ దర్శనమిచ్చింది. గుజరాతీ పెళ్లిళ్లలో ఈ రామన్‌దివోకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. వివాహ వేదిక వద్దకు వరుడు తరలివస్తున్న సమయంలో అతడి తల్లి దానిని తనవెంట తీసుకొస్తుంది. ఈ ల్యాంప్‌ను శుభప్రదంగా భావిస్తారు. అది చీకటిని పారదోలి, కొత్త దంపతులకు ఆశీర్వాదాలు అందిస్తుంది విశ్వసిస్తారు.
మూడు వేలకు పైగా వంటకాలు
అతిథులకు స్వాగత సత్కారాలతో పాటు వీడ్కోలు కూడా ఘనంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. గెస్ట్‌లకు కోట్ల రూపాయల విలువైన బహుమతులను అందజేశారు. వీవీఐపీ అతిథులకు రిటర్న్ గిఫ్టుగా గడియారాలను బహుమతిగా అందజేశారు. అనంత్ అంబానీ రాధిక పెళ్లి మెనూలో మూడు వేల వంటకాలున్నాయి. అంతర్జాతీయ చెఫ్‌ల ద్వారా వీటిని వండించారు. 100కు పైగా వంటకాలను ఇండోనేషియా క్యాటరింగ్ కంపెనీల చేత చేయించారు.
ఒక్కో రోజు ఒక్కో డ్రెస్ కోడ్
జూలై 12 శుక్రవారం జరిగిన శుభ వివాహ్ కార్యక్రమానికి వధూవరులిద్దరూ భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో మెరిశారు. ఇక, శనివారం జరిగిన దైవాశీర్వాద వేడకకు ఫార్మల్ డ్రెస్ కోడ్‌లో ఆకట్టుకున్నారు. ఇక ఆదివారం జరగనున్న రిసెప్షన్‌లో వధూవరులతో పాటు అతిథులు సైతం ఇండియన్ చిక్ థీమ్‌లో డ్రెసప్ అవ్వాలని తెలిపింది. అంటే ఇండియన్ టచ్‌లో మోడ్రన్ డ్రెస్సులు వేసుకోవాలని కోరింది. ఇలా మూడు రోజుల పాటు ఒక్కో విధంగా డ్రెస్ కోడ్ పెట్టారు.
ప్రధాని మోదీ ఆశీర్వాదం
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ శుభ ఆశీర్వాద్ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి రామ్మెహన్ నాయుడు తదితరులు హాజరయ్యారు. ప్రధాని మోదీ నూతన వధూవరులను ఆశీర్వదించి కాసేపు వారితో ముచ్చటించారు.
ఇషా అంబానీ లెహంగా ప్రత్యేకత ఇదీ
వివాహానికి ముందు అంబానీ కుటుంబం శివశక్తి పూజను నిర్వహించింది. ఈ శివశక్తి పూజలో ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ ధరించిన దుస్తులు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. పూజకు సరిగ్గా సూటయ్యేలా వేద మంత్రాలతో కూడిన డ్రెస్‌ను ఆమె ధరించడం విశేషం. ఢిల్లీకి చెందిన ప్రముఖ డిజైనర్ హౌజ్ ‘ఢిల్లీ వింటేజ్ కో’ ఆమె ధరించిన లెహంగాను డిజైన్ చేసింది. లెహంగాను పూర్వకాలం నాటి అలంకారాలు, భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా రూపొందించారు. లెహంగా అంచుల మీద భగవద్గీత శ్లోకం కనిపించేలా డిజైన్ చేశారు. సుమారు 4 వేల గంటల పాటు శ్రమించి లెహంగా డిజైన్ పూర్తి చేసినట్లు సమాచారం.
అమితాబ్ నుంచి బిల్‌గేట్స్ వరకు..
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహ వేడుకకు బిల్‌గేట్స్, జుకర్‌బర్గ్, ఇవాంకా ట్రంప్, జాన్‌సెనా, కిమ్‌కర్దాషియాస్, గౌతమ్ అదానీ, టోనీ బ్లేయిర్, రిహానా, మైక్‌టైసన్, డేవిడ్‌బెక్‌హోమ్, అమితాబ్‌బచ్చన్, రజినీకాంత్, షారుక్‌ఖాన్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్, రణబీర్ కపూర్, సంజయ్‌దత్, కరణ్ జోహార్, వెంకటేష్, రామ్‌చరణ్, మహేష్‌బాబు, జాన్వీ కపూర్, ప్రియాంకా చోప్రా వంటి ప్రముఖులు హాజరయ్యారు. మరోవైపు, సచిన్ టెందుల్కర్, ఎమ్మెస్ ధోనీ, రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ తదితర క్రికెటర్లు సైతం హాజరై వధూవరులను ఆశీర్వదించారు.