calender_icon.png 23 January, 2025 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుక్కు వంతు!

23-01-2025 01:44:53 AM

  1. ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు?
  2. దిల్‌రాజు, మైత్రీ మూవీ మేకర్స్, 
  3. మ్యాంగో మీడియా సంస్థల్లో రెండో రోజూ సోదాలు

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 22 (విజయక్రాంతి): టాలీవుడ్ నిర్మాతలు, మూవీ మేకర్ సంస్థలపై ఐటీ దాడులు బుధవారం కూడా కొనసాగా యి. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలై రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టిన పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్‌కు బుధవారం ఐటీ అధికారులు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మణికొండ, గచ్చిబౌలి, కొండాపూర్‌లో గల సుకుమార్ ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. పుష్ప-2 సినిమాకు ఆయన భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆదాయం, పన్ను దిల్‌రాజు వివరాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా మంగళవారం నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహి ల్స్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్‌రాజు.. కార్యాలయాలు, బంధువులు, మైత్రీమూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఎర్నేని, ఆ సంస్థకు చెందిన రవి, భాగస్వాములు, ప్రముఖ గాయని సునీత భర్త రాముకు చెందిన మ్యాంగో మీడియా సంస్థ కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. 

ఈక్రమంలో రెండో రోజూ తనిఖీలు కొనసాగాయి. మైత్రీ మూవీ మేకర్స్‌కు చెందిన కార్యాలయాల్లోనూ అధికారులు మరిన్ని డాక్యుమెంట్లు పరిశీలించినట్లు సమాచారం. రెండో రోజూ 55 బృందాలతో అధికారులు సోదాలు నిర్వహించారు. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపుల మధ్య తేడా ఉన్నట్లు గుర్తించారు.

ఆయా సంస్థలకు చెందిన ఆర్థిక లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు, బ్యాంకు లాకర్లను కూడా అధికారులు తనిఖీ చేసినట్లు తెలిసింది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

బుధవారం అర్థరాత్రి, గురువారం మధ్యాహ్నం వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా టాలీవుడ్ ప్రముఖుల ఇండ్లలో రెండు రోజులుగా ఐటీ దాడులు జరగడం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. 

ఆ సినిమాల బడ్జెట్, ఆదాయం, పన్నుపై ఆరా..

పుష్ప-2, గేమ్‌చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల బడ్జెట్, ఆదాయం, పన్ను చెల్లింపుపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణంలో భాగంగా సుకుమార్ నిర్మాణ సంస్థ ‘సుకుమార్ రైటింగ్స్’తో మైత్రీ మూవీ మేకర్స్ భాగస్వామ్యం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే సుకుమార్ ఇల్లు, కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు.. ఆయనను ఎయిర్‌పోర్టు నుంచి ఐటీ అధికారులు ఇంటికి తీసుకొచ్చినట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాంకు లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు సినిమా వసూళ్లకు తగ్గట్లుగా ఐటీ చెల్లింపులు జరుగలేదని నిర్ధారించారు.

అటు దిల్‌రాజు కుమార్తె హన్సితారెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహించి, ఆమె సమక్షంలో డిజిటల్ లాకర్లు ఓపెన్ చేయించినట్లు తెలుస్తోంది. 

అందరిపై ఐటీ దాడులు జరుగుతున్నాయి: దిల్‌రాజు

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినవారిపై జరుగుతున్న ఐటీ సోదాలపై ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్‌రాజు స్పందించారు. బుధవారం హైదరబాద్‌లోని ఆయన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతూ.. మీడియాలో తన మీద, తన సంస్థల మీద మాత్రమే ఐటీ దాడులు జరుగున్నట్లు ప్రచారం జరుగుతోందని.. వాస్తవానికి ఇండస్ట్రీకి చెందిన చాలామందిపై ఐటీ దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ దాడులు సాధారణమేనని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.