22-04-2025 12:00:00 AM
నూతన ఆర్‌ఓఆర్‌పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి
కాగజ్ నగర్,ఏప్రిల్ 21 (విజయక్రాంతి ): భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూభారతి ఆర్‌ఓఆర్ నూతన చట్టాన్ని తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం జిల్లాలోని కాగజ్ నగ ర్ మండలం వంజరి గ్రామంలోని రైతు వేదికలు భూభారతి నూతన ఆర్‌ఓఆర్ చట్టం లోని హక్కులు, అంశాలపై రైతులకు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకుఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు లతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి నూతన ఆర్‌ఓఆర్ చట్టం రైతులకు ఎంతో మేలు చేస్తుందని, రికార్డులలో ఏదైనా తప్పుల సవరణకు తహ సీల్దార్ కార్యాలయంలో సరిచేసుకునే అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. ధరణి పోర్టల్‌లోని పార్ట్ బిలో ఉన్న భూములకు భూభారతి చట్టంలో పరిష్కరించడానికి అవకాశం కల్పించడం జరిగిందని, భూభారతి చట్టంలోని అంశాలు, హక్కులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
దండే విఠల్ మాట్లాడుతూ భూ సమ స్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నూతన ఆర్‌ఓఆర్ చట్టం తీసుకువచ్చి రికార్డులలోని తప్పు-ఒప్పులను సవరించుకునే అవకాశం కల్పించిందని, పట్టా మార్పిడి సులభమైన పద్ధతిలో జరుగుతుందని తెలిపారు.
హరీష్ బాబు మాట్లాడుతూ ధరణి స్థానంలో భూ భారతి నూతన ఆర్‌ఓఆర్ చట్టం తీసుకురావడంతో రైతులకు, అసలైన భూ యజ మానులకు మేలు కలుగుతుందని, గతంలో ధరణి లో ఏదైనా తప్పు జరిగితే పరిష్కరించేందుకు ఎలాంటి అవకాశం ఉండేది కాదని, కానీ భూభారతిలో అప్పిలు వ్యవస్థ తీసుకురావడంతో రైతులకు మంచి జరుగుతుందన్నారు.
రాజస్వ మండల అధికారి, జిల్లా కలెక్టర్, సీసీఎల్ ఎ స్థాయిలలో అప్పీలుకు అవకాశం కల్పించడం జరిగిందని, పట్టా మార్పిడిలో సంబంధిత యజమానులు తమ కమతం సంబంధించిన నక్ష జతపరచడం వలన ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పట్టా మార్పిడి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహ సిల్దార్ కిరణ్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.