రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘తల్లి మనసు’. పూర్వాశ్రమంలో పలువురు ప్రముఖ దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసి, అనుభవం గడించిన వీ శ్రీనివాస్ (సిప్పీ) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ తొలిసారి నిర్మాతగా మారి, నిర్మించిన చిత్రమిది.
ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 24న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని నిర్మాత ముత్యాల అనంత కిశోర్ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయమై చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకరులతో సమావేశమైంది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ.. ‘తల్లికి ఎన్ని నిర్వచనాలు ఇచ్చినా సరిపోవు. అలాంటి తల్లి సబ్జెక్టును తీసుకుని, పాత్రలకు తగ్గ నటీనటులనే ఎంచుకుని ఈ సినిమాను తీశాం.
ఇలాంటి మంచి చిత్రాలను ఆదరిస్తే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి’ అని అన్నారు. ప్రధాన పాత్రధారిణి రచిత మహాలక్ష్మి మాట్లాడుతూ.. ‘ఇందులో నేను చేసిన తల్లి పాత్రకు కొందరు ప్రముఖ హీరోయిన్లను నిర్మాత, దర్శకులు సంప్రదించినపుడు కొడుకు పాత్ర ఉన్నందువల్ల తాము చేయమని చెప్పారట. ఈ నేపథ్యంలో ఆ అవకాశం నాకు లభించడం అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే మంచి నటనను ప్రదర్శించే అవకాశంతోపాటు నా కెరీర్ అంతా గుర్తుండిపోయే పాత్ర ఇది’ అని తెలిపారు.
డైరెక్టర్ సిప్పీ మాట్లాడుతూ.. ‘ఓ తల్లి ఎలాంటి సంఘర్షణలకు గురయ్యిందన్న అంశాన్ని ప్రేక్షకులకు హత్తుకునేలా వైవిధ్యంగా చెప్పాం. భావోద్వేగం, సెంటిమెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి అంశాల మేళవింపుతో చిత్రం ఉంటుంది. నిర్మాతకు అభిరుచి లేకపోతే ఇంత మంచి చిత్రం రాదు’ అని చెప్పారు. ఈ ప్రెస్‌మీట్‌లో ఇంకా హీరోలు కమల్ కామరాజు, సాత్విక్ వర్మ, నటులు దేవీప్రసాద్, జబర్దస్త్ ఫణి, రచయిత నివాస్, డీవోపీ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.