calender_icon.png 24 October, 2024 | 3:59 AM

గూడేల అభివృద్ధే నిజమైన అభివృద్ధి

09-08-2024 01:22:05 AM

  1. వారి సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చిస్తా 
  2. అంబేద్కర్ వర్సిటీలో ‘ఆదివాసీ జీవనోపాధి పద్ధతుల’పై సదస్సు
  3. ప్రారంభించిన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయ క్రాంతి): దేశంలోని మారుమూల ప్రాంతాలు, ఆదివాసీ గూడేలు అభివృద్ధి జరిగినప్పుడే నిజమైన అభివృద్ధి అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్పష్టంచేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, పొలిటికల్ సైన్స్ విభాగం, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో  ‘ఆదివాసీ జీవనోపాధి పద్ధతులు.. సాధికారత సాధనలో సమస్యలు, వ్యూహాలు’ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను ఆదివాసీ బిడ్డను కావడం గర్వంగా ఉందని చెప్పారు. ఎవరినీ ఇబ్బంది పెట్టని జాతి ఆదివాసీ అని స్పష్టం చేశారు. గత కొన్నేండ్లుగా ఆత్మగౌరవం కోసం ఆదివాసీలు చేస్తున్న పోరాటం కొనసాగుతూనే ఉందని పేర్కొన్నారు. ఆదివాసీల సమస్యల పరిష్కారం, సాధికారతపై మేధావులు, ఇలాంటి కాన్ఫరెన్స్‌లు నిర్వహించి, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలకు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. వాటి పరిష్కారం కోసం తాను సీఎం రేవంత్‌రెడ్డితో చర్చిస్తాననని తెలిపారు.

కార్పొరేట్ సంస్థలు కూడా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. ఏ అభివృద్ధి నమూనాలోనైనా ఆదివాసీలు వెనుకంజలోనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో ఆదివాసీలు నిర్వాసితులవుతున్నారని, అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేసే ఆలోచన పాలకులకు ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఈ సుధారాణి, అకాడమిక్ డైరెక్టర్ జీ పుష్ప చక్రపాణి,  డైరెక్టర్ ప్రొఫెసర్ గుంటి రవీందర్, వడ్డాణం శ్రీనివాస్, పలు విభాగాల అధిపతులు, డీన్లు పాల్గొన్నారు. 

ఉన్న మాట చెప్తే ఉలుకెందుకు?  

బీఆర్‌ఎస్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పంచాయతీలపై ఉన్న మాట చెబితే ఆ పార్టీ నాయకులు ఉలిక్కిపడుతున్నారని మంత్రి సీతక్క అన్నారు. గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లులపై మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. గత ప్రభుత్వంలో ఏండ్లుగా బిల్లులు పెండింగ్ పెట్టడంతో గ్రామ పంచాయతీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా పనులు చేయించి.. వేల కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్థిక శాఖ మాజీ మంత్రి హరీశ్‌రావుకు పెండింగ్ బిల్లుల బాగోతం తెలుసని, అయినా పదేపదే వాస్తవాలను వక్రీకరించడమంటే ఆత్మవంచన చేసుకోవడమే అవుతుందని అన్నారు.

15వ ఫైనాన్స్ కమిషన్‌కు సంబంధించి రూ.431.32 కోట్ల నిధులను గ్రామ పంచాయతీలకు విడుదల చేయడంతోపాటు అదనంగా రూ.323.99 కోట్ల సీఆర్‌డీ నిధులను గ్రామ పంచాయతీలకు అందించామని స్పష్టంచేశారు. పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి వేతనాలు విడుదల చేయలేదనడం అవాస్తవమన్నారు. పారిశుద్ధ్య కార్మికుల బకాయిలు రూ.150.57 కోట్ల నిధులను విడుదల చేస్తూ జూలై 15న ప్రోసీడింగ్స్ ఇచ్చామని వెల్లడించారు. సర్పంచులను రాచి రంపానపెట్టి, ఇప్పుడు వారి పట్ల మొసలి కన్నీరు కార్చడం మీకే చెల్లిందని అన్నారు. బీఆర్‌ఎస్ హయంలో పెండింగ్ బిల్లుల సమస్యలతోనే ఎంతోమంది సర్పంచులు, ప్రజాప్రతినిధులు ఆత్మహత్యలు చేసుకున్నారని విరుచుకుపడ్డారు. పంచాయతీల సమస్యలపై మీరు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉందని ఎద్దేవాచేశారు. 

ఆదివాసీల సంక్షేమానికి కట్టుబడిఉన్నాం: సీఎం

హైదరాబాద్, ఆగస్టు 8(విజయక్రాం తి): అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు  సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మూలవా సులుగా అమ్మలాంటి అడవికి తోడుండే భూమి పుత్రులుగా, కల్మశంలేని అనుబం ధాలకు ప్రతీకలుగా ఆదివాసీలు నిలుస్తార ని, అలాంటి గిరిజనుల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. రాష్ట్ర బడ్జెట్‌లో రూ.17,056 కోట్ల కేటాయించి గిరిజన సంక్షేమానికి  ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు.