calender_icon.png 28 December, 2024 | 1:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘రియల్’ రంగానికి మంచి రోజులు

28-10-2024 12:41:59 AM

  1. పర్యాటక శాఖమంత్రి జూపల్లి  కృష్ణారావు
  2. హైటెక్స్‌లో ముగిసిన నారెడ్కో ప్రాపర్టీ షో  

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 27 (విజయక్రాంతి): మూసీ పునరుజ్జీవనం, ముచ్చర్లలో ఫోర్త్ సిటీ, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, స్కిల్ యూనివర్శిటీ, స్పోర్ట్స్ యూనివర్శిటీ, ఎలివేటెడ్ కారిడార్ తదితర ప్రభుత్వ ప్రాజెక్టులతో రియల్ ఎస్టేట్ రంగానికి గతం కంటే మంచి రోజులు రానున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

హైదరాబాద్ నలువైపులా అన్నిప్రాంతాలలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హైటెక్స్‌లో నారెడ్కో ఆధ్వ్యంలో నిర్వహించిన 14వ ప్రాపర్టీ షో ఆదివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి మాట్లాడుతూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను అంతర్జాతీయస్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.

మూసీ ప్రాజెక్టు అద్భుతమైందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో నిర్మాణరంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. బిల్డర్లు, రియల్టర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అప్రూవల్ ఉన్న ప్రాజెక్టుల జోలికి హైడ్రా వెళ్లదని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారని పేర్కొన్నారు. గతంలో పొందిన నిర్మాణ అనుమతులు, ఎన్‌ఓసీలు రద్దు చేయబోమని తెలిపారు. కొందరు తమ రాజకీయ లబ్ధి కోసమే సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ భాను ప్రసాద్, నారెడ్కో వైస్ ప్రెసిడెంట్ కాళీ ప్రసాద్ దామెర, సెక్రటరీ జనరల్ శ్రీధర్ రెడ్డి, ట్రెజరర్ వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.  

బౌద్ధారామాలను పునరుజ్జీవింపజేస్తాం..

 ఒకప్పుడు తెలంగాణలో విలసిల్లిన బౌద్ధారామాలను పునరుజ్జీవింపజేసేందుకు ప్రభు త్వం కృషి చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని మహాబోధి బుద్ధవిహార్‌ను జూపల్లి సందర్శించి కఠిన చీవర దానోత్సవాన్ని ప్రారంభించారు.  బుద్ధ విహార్ నిర్మాణానికి ఇప్పటికే రూ.2.17 కోట్లను కేటాయించినట్లు గుర్తు చేశారు.

డాక్టర్ శివనాగిరెడ్డి పాళీ భాష నుంచి తెలుగులోకి అనువదించిన ‘బుద్ధ వంశం’ అనే గ్రంథాన్ని ఆవిష్కరించారు. బుద్ధి త్రిపీటికలను తెలుగులోకి అనువదించాలని మంత్రిని బౌద్ధ భిక్షువులు కోరగా.. రూ.4 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే  ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు నాగార్జునసాగర్, హైదారాబాద్‌లో బుద్ధిస్ట్ సాంస్కృతిక, వారసత్వ ఉత్సవా లను నిర్వహించనున్నట్లు భిక్షువులు మంత్రికి వివరించారు.