calender_icon.png 27 October, 2024 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

నిర్మాణ రంగానికి మంచి రోజులు

13-07-2024 01:04:02 AM

  • ల్యాండ్ వాల్యూ పెంచాలని ప్రభుత్వాన్ని కోరాం 
  • గతేడాది లక్ష యూనిట్ల విక్రయం 
  • ఆగస్టులో క్రెడాయ్‌బిలిటీ పేరుతో ప్రాపర్టీ షో 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 12 (విజయక్రాంతి): రాష్ట్రంలో వరుసగా వచ్చిన ఎన్నికలు కారణంగా నిర్మాణ రంగం 8 నెలలుగా ఒడిదొడుకులు ఎదుర్కొంటోందని, ఆగస్టు నుంచి రియల్ రంగానికి మరిన్ని మంచి రోజులు రానున్నాయని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షులు రాజశేఖర్‌రెడ్డి, ఎలక్టెడ్ ప్రెసిడెంట్ జైదీప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జగన్నాథ రావు అన్నారు. అంతర్జాతీయ నగరంగా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌లో 360 డిగ్రీల కోణంలో నిర్మాణ రంగానికి ప్రోటెన్షియల్ ఉంటుందన్నారు. ఆగస్టు 2 నుంచి 4 దాకా హైటెక్ సిటీ హైటెక్స్‌లో, కొంపల్లిలో 9 నుంచి 11 వరకు, నాగో ల్ మెట్రో స్టేషన్‌లో 23 నుంచి 25వ తేదీ దాకా క్రెడాయ్‌బిలిటీ పేరుతో ప్రాపర్టీ షో జరుగుతుందని ఐటీసీ కాకతీయలో శుక్రవారం జరిగిన సమావేశంలో వెల్లడించి.. క్రెడాయ్‌బిలీటీ బ్రోచర్‌ను ఆవిష్కరించారు.

హైదరాబాద్ అధ్యక్షులు రాజశేఖర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మారినపుడు సాధారణంగా ప్రతి ఒక్కరికీ సందే హాలు ఉంటాయని.. అందుకే రియల్ వ్యాపారం కొంత స్తబ్ధతకు గురైందని వివరించారు. జీహెచ్‌ఎంసీ నుంచి హెచ్‌ఎండీఏ దాకా విస్తరిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ అభివృద్ధి వెస్ట్‌సైడ్ మాత్రమే కాకుండా, 360 డిగ్రీల కోణంలో జరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ల్యాండ్ వాల్యూ పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరినట్లు తెలిపారు. ఈ విషయంపై శాస్త్రీయమైన అధ్యయనం జరగాల్సి ఉందని.. ఒకప్పుడు అవసరానికి మాత్రమే కొనుగోలు చేసేవారని, ప్రస్తుతం ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ప్రాఫిట్ గా రియల్ వ్యాపారాన్ని ప్రతి ఒక్కరూ చూస్తున్నారన్నారు.

గతేడాది లక్ష యూనిట్లను విక్రయించామని, 4.5 లక్షల యూనిట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. నగరంలో రూ. 35 లక్షల నుంచే ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విపత్తు సమయంలోనూ మంచి గ్రోత్ నమోదు అయిందని.. భవిష్యత్తులో మౌలిక సదుపాయాలు, అనుకూలమైన వ్యాపార వాతావరణం, పెట్టుబడులు లక్ష్యంగా కొనసాగుతున్న స్థిరమైన పాలనతో ప్రపంచ వ్యాప్తంగా రియల్ గ్లోబల్ సిటీగా హైదరాబాద్ నిలుస్తుందన్నారు. నైట్ ఫ్రాంక్ ఇండియా, ప్రపంచ బ్యాంక్ గ్రూప్ డూయింగ్ బిజినెస్ రిపోర్టు, గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్ట్, మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ సర్వే తదితర నివేదికలలో హైదరాబాద్ ఉత్తమమైన నగర జాబితాలో చోటుదక్కించుకుందని వివరించారు.

క్రెడాయ్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ జైదీప్ రెడ్డి మాట్లాడుతూ.. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ద్వారా 884 అభివృద్ధి ప్రాజెక్టులు గ్రీన్ బిల్డింగ్‌లుగా ఎన్‌రోల్ అయ్యాయని.. హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు 25 శాతం గ్రీన్ సర్టిఫికెట్‌లు పొందినట్టు తెలిపారు. ఆగస్టులో ప్రదర్శించే అన్ని ప్రాజెక్టులు గ్రీన్ లివింగ్‌ను దృష్టిలో పెట్టుకునే రూపొందించినట్టు పేర్కొన్నారు. హైటెక్స్‌లో జరిగే కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, కొంపల్లిలో జరిగే కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, నాగోల్‌లో జరిగే కార్యక్రమానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు హజరవుతారని తెలిపారు.