calender_icon.png 23 October, 2024 | 6:00 PM

అల్విదా అండర్సన్

13-07-2024 12:44:53 AM

టెస్టు క్రికెట్‌లో ఒక శకం ముగిసింది. ఇన్నాళ్లు ఇంగ్లండ్ బౌలింగ్ బారాన్ని మోసిన సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ అంతర్జాతీయ కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికాడు. వెస్టిండీస్‌తో చివరి టెస్టు మ్యాచ్ ఆడిన జిమ్మీ మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అత్యధిక వికెట్లు తీసిన వీరుల జాబితాలో మూడో స్థానంలో నిలిచి రికార్డులకెక్కిన అండర్సన్‌కు అల్విదా..!

వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం

లండన్: ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. లార్డ్స్ వేదికగా వెస్టిండీస్‌తో చివరి టెస్టు మ్యాచ్ ఆడిన అండర్సన్ నాలుగు వికెట్లు పడగొట్టి 704 వికెట్లతో కెరీర్‌ను ఘనంగా ముగించాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో జేమ్స్ అండర్సన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. దిగ్గజాలు ముత్తయ్య మురళీధరన్ (800 వికెట్లు), షేన్ వార్న్ (708 వికెట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. అండర్సన్ తర్వాత టీమిండియా దిగ్గజం అనిల్ కుంబ్లే (619) నాలుగో స్థానంలో ఉన్నాడు.

మ్యాచ్ అనంతరం అండర్సన్ మాట్లాడుతూ..‘21 ఏళ్ల కెరీర్‌లో ఎత్తుపల్లాలు చూశా. ఇంగ్లండ్ క్రికెట్ ఎల్లప్పుడు అండగా నిలిచింది. కెరీర్‌లో ఎందరో దిగ్గజ ఆటగాళ్లతో కలిసి క్రికెట్ ఆడడం మరిచిపోలేని అనుభూతి. యువ ఆటగాళ్లకు చెప్పేది ఒక్కటే.. ప్రతీ క్షణాన్ని ఆస్వాదించండి.. అప్పుడే మీ జర్నీ గొప్పగా సాగుతుంది’ అని అన్నాడు. తొలి టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై విజయాన్ని అందుకుంది.

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 371 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకు కుప్పకూలిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 136 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 12 వికెట్లు తీసిన అకిన్‌సన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్నాడు. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ఈ నెల 18 నుంచి ప్రారంభంకానుంది.