calender_icon.png 26 October, 2024 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచి - చెడు

25-05-2024 12:00:00 AM

పుస్తకం ముందు పెట్టుకుని ఆలోచిస్తున్న కొడుకు అర్జున్ దగ్గరికి తండ్రి శ్రీహరి వచ్చాడు. 

‘ఏమిట్రా అలా ఉన్నావు?’ అని అర్జున్‌ని చూస్తూ అడిగాడు.

‘రేపు పరీక్ష కదా నాన్నా..! సరిగ్గా రాయగలనో లేదో అనిపిస్తోంది’ అని దిగాలుగా తండ్రికి చెప్పాడు.

‘ఓ అదా...! నువ్వు కష్టపడి చదువుతావు. మరింకెందుకా సందేహం చెప్పు. బాగా చదవని వాళ్లు అలాంటి విషయాలు ఆలోచించాలి’

‘ఏమో..! ఎందుకో తెలియదు. నేను మరిచిపోతానేమోనని కూడా అనిపిస్తోంది’

‘ఒకటికి నాలుగు సార్లు చదివితే అది మనసులో ముద్రపడి పోతుంది. అప్పుడు నీకు ఈ నెగెటివ్ థాట్ కూడా రాదు. నేను చెబుతున్నాగా...’

‘ఏమో...!’

‘నీకున్న ఒకే ఒక చెడు గుణం... నేను సాధించలేనేమో అనుకోవటం. నేను సాధిస్తాను అని అడుగు ముందుకు వేయటం నేర్చుకోవాలి. అప్పుడే విజయం చేరువవుతుంది.’

‘కాకపోతే?’

‘అదే.. ఆ ఆలోచనే వద్దంటున్నాను. నీకో కథ చెప్పనా... మహాభారతంలో ద్రోణాచార్యుడు తన శిష్యులకు శిక్షణ ఇస్తుంటాడు. శిక్షణలో భాగంగా చిటారు కొమ్మన ఉన్న పక్షి కన్నుకు బాణం వెయ్యాలని ద్రోణాచార్యుడు శిష్యులను ఆదేశిస్తాడు. ధర్మరాజుతో సహా నూట నాలుగు మంది శిష్యులెవరూ గురి చూసి కొట్టలేకపోతారు. అప్పుడు అర్జునుడు సరిగ్గా లక్ష్యాన్ని గురి చూసి కొడతాడు.’

‘అలా... ఎలా?’

‘దాన్నే ఏకాగ్రత అంటారు. చేసే పని మీద దృష్టి పెట్టడం... ఇతర విషయాలు ఆలోచించకపోవటం.’

‘ఓ... ఏకాగ్రత అంటే అదా!?’

‘అవును.. పట్టుదల, కృషి ఏకాగ్రతకు తోడైతే ఇక విజయం మనదే అవుతుంది. ముందు నేను చెయ్యలేనేమో అనే ఆలోచనను నీ దగ్గరకు రానివ్వటం ఆపేసెయ్. నేను చేయగలను అని మంచిగా ఆలోచించు. మనం ఏది చెప్తే అది మన మనసు వింటుంది. కాబట్టి నీ మనసును నీ అదుపులో ఉంచుకొని మసులుకో..’

‘అలాగే నాన్నా! ఇక నుంచి ఆ అర్జునుడి లాగా ఈ అర్జున్ కూడా ముందుకే దూసుకుపోతాడు’ అని నవ్వుతూ అన్నాడు.

నీతి: చెడు ఆలోచనలు మన విజయానికి అడ్డుగా మారుతాయి. మంచి ఆలోచనలు మన విజయానికి సోపానంగా మారుతాయి.

 యలమర్తి అనూరాధ

 (రచయిత్రి)