మాజీ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి
యాదాద్రి భువనగిరి,(విజయక్రాంతి): తెలంగాణలో రౌడీల పాలన నడుస్తున్నదని, సోమవారం నర్సాపూర్ లో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపైన దాడి చేయడం హేయమైన చర్య అని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆమె ఒక వీడియోను విడుదల చేశారు. ఎవరు ప్రశ్నిస్తే వాళ్లను టార్గెట్ చేసి భౌతికంగా దాడులు చేస్తూ భయపెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ దాడులను ప్రోత్సహిస్తున్నారని, మొన్న పాడి కౌశిక్ రెడ్డిపైన, నిన్న సునీత లక్ష్మారెడ్డి ఇంటిపైన జరిగిన దాడులని సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే జరుగుతున్నాయని చెప్పారు.
తెలంగాణ అంటేనే భయపడే రోజులు తీసుకొచ్చారని తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షిణించాయన్నారు. మహిళలంటే కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి అసలు గౌరవం లేదు. దాడులు చేస్తాం, భయపెడతామంటే చూస్తూ ఊరుకోం.. బాధ్యత గల ప్రతిపక్షంగా మిమ్మల్ని అడుగడుగునా నిలదీస్తాం.. రేవంత్ రెడ్డి ఇలాంటి చిల్లర ప్రయత్నాలు మానుకో అని హెచ్చరించారు. నిన్న నరసాపూర్ లో దాడికి పాల్పడ్డ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని గొంగిడి సునీత మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.